
చంద్రబాబు పర్యటనతో ప్రజాధనం దుర్వినియోగం
పాడేరు : ీసఎం చంద్రబాబు పాడేరు పర్యటన వల్ల రూ.కోట్లమేర ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని, గిరిజనులకు ఒరిగింది శూన్యమని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివాీసీలపై చంద్రబాబు ఏమాత్రం కూడా ప్రేమ లేదన్నారు. నిజంగా ఆదివాసీలపై ప్రేమ ఉంటే జీవో నంబరు 3, 1/70 చట్టంపై స్పష్టత ఇచ్చేవారన్నారు. గిరిజన, సంక్షేమం అభివృద్ధిపై ఒక్క హామీ, ప్రకటన కూడా చేయలేదన్నారు. గిరిజన ప్రాంతంలో స్థానిక గిరిజన అభ్యర్థులకు చెందాల్సిన సుమారు 3వేల ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీలో కలిపి గిరిజన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఆదివాసీలపై నిజంగా ప్రేమ ఉంటే శతశాతం ఉద్యోగ రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. జీవో నంబరు 3ను వైఎస్సార్‌సీపీ రద్దు చేసిందనడం ఆయన అవివేకానికి నిదర్శమన్నారు. ఆ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేస్తే ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే గిరిజనుల పక్షాన ఆలోచించి టీఏసీలో తీర్మానం చేసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. సుమారు 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏనాడు కూడా పాడేరులాంటి ఆదివాసీ ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే కనీస ఆలోచన ఎందుకు చేయలేదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాడేరు వచ్చి స్థానిక ఆదివాసీల ఆరోగ్య కష్టాలు కళ్లారా చూసి ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణకు రూ.500కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటు చేశారన్నారు. ఆదివాసీల ప్రగతి కోసం చంద్రబాబు ఏనాడు పాటుపడలేదన్నారు. సుమారు ఏడాది కాలంలో పాడేరు ఐటీడీఏలో పూర్తి స్థాయి ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ఇంచార్జీల పానలతో గిరిజన సంక్షేమం పూర్తిగా కుంటుపడిందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఏనాడూ ఐటీడీఏకు వచ్చి సమీక్ష చేయలేదన్నారు. కేవలం చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారని చెప్పారు. ఈ నెలాఖరున రిటైర్డ్ కానున్న గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ ఇటీవల భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీ అడ్డంగా దొరికిపోయారని, ఇటువంటి వ్యక్తిని ఇంకొంతకాలం ఆ పదవిలో కొనసాగించేందుకు ప్రయత్నం చేసింది ఎవరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతంలో పీసా కమిటీలకు కనీస గౌరవం లేకుండా ఎటువంటి తీర్మానాలు చేయకుండా కార్పొరేట్ కంపెనీలకు వారి ప్రాజెక్టులకు అనుమతులను ఇస్తుంది ఎవరని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఎన్ని మోసపూరిత వాఖ్యలు చేసిన ఆదివాసీలు నమ్మే స్థితిలో లేరన్నారు. సీఎం పర్యటన పూర్తిగా నిరాశ పరిచిందని ఆయన పేర్కొన్నారు.
జీవో నంబరు 3, 1/70 చట్టంపై
స్పష్టత శూన్యం
ఆదివాసీల ఆరోగ్య కష్టాలపై
చలించిన జగన్
పాడేరులో రూ.500 కోట్లతో
వైద్య కళాశాల ఏర్పాటు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజం