
క్రమశిక్షణతోనే వృత్తిలో రాణింపు
● జస్టిస్ లక్ష్మణరావు
సబ్బవరం: క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యం దిశగా కృషి చేసినప్పుడే ఎంచుకున్న వృత్తిలోనైనా, చదువులోనైనా రాణించగలరని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు అన్నారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన మూడు, ఐదేళ్ల కోర్సుల విద్యార్థులకు శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘న్యాయవిద్య: సమకాలీన పరిస్థితుల్లో దాని ఆవశ్యకత’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. గురువులను పూజిస్తూ, క్రమశిక్షణతో ముందున్న లక్ష్యాలను చేరుకోవడానికి దీక్షతో కృషి చేయాలన్నారు. సత్యం, ధర్మం ప్రాముఖ్యతను మహాభారతంలోని ఉదాహరణలతో వివరించారు. సత్యాన్ని అనుసరించాల్సిన ప్రాముఖ్యతను మహాత్మా గాంధీ అనేక సందర్భాలలో తెలియజేశారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. తాము చదువుకునే రోజుల్లో జాతీయ విశ్వవిద్యాలయాలు లేవని.. చిన్న చిన్న న్యాయ కళాశాలల్లో చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. నేటి తరానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావు, వ్యాట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆలపాటి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణరావును వర్సిటీ తరపున ఘనంగా సత్కరించారు.

క్రమశిక్షణతోనే వృత్తిలో రాణింపు