అప్పన్న ఆభరణాల తనిఖీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అప్పన్న ఆభరణాల తనిఖీలు ప్రారంభం

Aug 10 2025 5:47 AM | Updated on Aug 10 2025 5:47 AM

అప్పన్న ఆభరణాల తనిఖీలు ప్రారంభం

అప్పన్న ఆభరణాల తనిఖీలు ప్రారంభం

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి చెందిన బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువులు, ఆభరణాల తనిఖీలను దేవదాయశాఖ, రాజమహేంద్రవరం ఆర్‌జేసీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ శనివారం ప్రారంభించింది. ఈ తనిఖీలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. కడప జిల్లాకు చెందిన కె.ప్రభాకరాచారి అనే వ్యక్తి గతేడాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రికార్డుల్లో పేర్కొన్న వివరాలకు, వాస్తవంగా ఉన్న ఆభరణాలకు తేడాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై దేవదాయశాఖ జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారి పల్లంరాజు ఈ ఏడాది జనవరి 17 నుంచి నెలరోజుల పాటు రికార్డులను పరిశీలించి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా మరింత లోతుగా తనిఖీలు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు. ఆ తర్వాత ఆ విషయం మరుగున పడింది. ప్రస్తుతం రాజమండ్రి ఆర్‌జేసీగా కూడా విధులు నిర్వహిస్తున్న సింహాచలం ఇన్‌చార్జి ఈవో త్రినాథరావు చొరవతో ఈ తనిఖీలు మళ్లీ మొదలయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయానికి చేరుకున్న కమిటీ సభ్యులు.. ముందుగా బండాగారంలోని ఆభరణాలు, వస్తువులను వాటి రికార్డులతో సరిపోల్చి బరువులు తనిఖీ చేశారు. ఈ కమిటీలో విజయనగరం డిప్యూటీ కమిషనర్‌ కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌, జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారి పల్లంరాజు, అంతర్వేది ఈవో ఎం.కె.టి.ఎన్‌.ప్రసాద్‌, తూర్పుగోదావరి డిప్యూటీ ఈవో ఇ.వి.సుబ్బారావు, ఆర్‌జేసీ కార్యాలయం సూపరింటెండెంట్‌ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఈ కమిటీకి దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ సహకరించారు. ఈ తనిఖీలు పారదర్శకంగా జరుగుతున్నాయని, పూర్తి నివేదికను సమర్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. రాబోయే రోజుల్లో అర్చకుల ఆధీనంలో ఉన్న వస్తువులు, మ్యూజియం, బ్యాంకుల్లో ఉన్న వస్తువులను కూడా పరిశీలిస్తామని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement