భూగర్భ జలాల పరిస్థితి..
భూ ఉపరితలం నుంచి లోనికి (మీటర్లలో)
జూలై 2025 : 4.00
జూలై 2026 : 7.55
ఆగస్టు 2026 : 4.28
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో భూగర్భజలాల మట్టం ప్రస్తుతం పరవాలేదనిపిస్తోంది. గతనెలతో పోల్చితే ఇటీవల కురిసిన వర్షాలతో ఆశాజనకంగా మారింది. ఒకటి, రెండు భారీ వర్షాలు కురిస్తే ఈ సీజన్ గట్టెక్కవచ్చనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది. గతేడాది జూలై చివరి వరకు భూగర్భజలమట్టం నాలుగు మీటర్లుగా నమోదవగా.. ప్రస్తుతం 4.28 మీటర్ల లోతులోనే ఉండడం గమనార్హం. అయితే గతేడాది ఆగస్టు పూర్తయ్యే సరికి 1.71 మీటర్లలో ఉండి జలాలు చేతికి అందేలా ౖపైపెకి వచ్చాయి. ఈ నెలలో భారీ వర్షాలు కురిస్తే మళ్లీ ఆ మట్టం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాలుగు రోజుల్లోనే..
జిల్లాలో జూలై మూడో వారం వరకు 40 శాతానికి మించి లోటు వర్షపాతం ఉన్న పరిస్థితి తెలిసిందే. అయితే ఆ నెల చివరి వారంలో కురిసిన వర్షాల కారణంగా ప్రస్తుతం సాధారణ వర్షపాతానికి చేరుకుంది. కేవలం నాలుగు రోజుల్లో కురిసిన వర్షం మొత్తం లోటు వర్షపాతాన్ని పూరించిన విషయం విధితమే. దాంతోనే భూగర్భ జలాలు ఈ మాత్రం పెరిగాయి.
జలాశయాల్లో పరిస్థితి..
జిల్లాలో రెండు మధ్యతరహా ప్రాజెక్టులు సాత్నాల, మత్తడివాగు ఉన్నాయి. ఇందులో సాత్నాల ఇంకా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు. మత్తడివాగు మాత్రం నిండుకుండగా మారడం కొంత ఊరటనిచ్చే అంశం. ఇక చెరువుల పరిస్థితి గమనిస్తే.. ఇంకా వందలాది చెరువులు 75శాతం లోపే ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తేనే అవి నిండేది. జలాశయాల్లో నీటి సామర్థ్యం పెరిగిన పక్షంలో సమీపంలోని గ్రామాల్లో భూగర్భ జలాల మట్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
వర్షపాతం వివరాలు..
సాధారణ వర్షపాతం 564 మి.మీ.లు
గతేడాది కురిసింది
491 మి.మీ.లు (13 శాతం లోటు)
ఈ ఏడాది కురిసింది
513 మి.మీ.లు (9 శాతం లోటు)
ప్రజల్లో చైతన్యం అవసరం
జిల్లాలో వర్షాభావ పరిస్థితులను ప్రజలు ఈ రెండు నెలల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారు. లోటు వర్షపాతంతో చోటు చేసుకున్న పరిస్థితులు మరో సారి ఉత్పన్నం కాకుండా ప్రజల్లో చైతన్యం పెరగాలి. చేలల్లో పాంపౌండ్స్, ఊట కుంటలు, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించుకోవాలి. ఇంటి సముదాయాల్లో ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టాలి. అలాంటప్పుడే భూగర్భ జలాలను రక్షించగలుగుతాం.
– సతీశ్‌యాదవ్, భూగర్భజల అధికారి, ఆదిలాబాద్


