కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్‌లో చెత్త సేకరణకు నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన పట్టణాలకే పరిమితమైన ఈవీలు ఇకపై ఆదిలాబాద్ పట్టణ వీధుల్లోనూ దర్శనమివ్వనున్నాయి. కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవతో వీటి కొనుగోలుకు మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించించింది. ఈ మేరకు ఆన్‌లైన్ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తోంది. ఈ నెల 7న ఖరారు చేసి వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లను ఎంపిక చేయనున్నారు. ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నెలాఖరులోగా వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఇదీ పరిస్థితి..
ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో డిజిల్‌తో నడిచే ఆటోలు, ట్రాక్టర్లనే చెత్త సేకరణకు వినియోగిస్తున్నారు. అయితే ఇంధన వ్యయం బల్దియాకు భారంగా మారుతోంది. పైగా వాటి నుంచి వచ్చే పొగ కారణంగా కాలుష్యం వెదజల్లుతుంది. అంతేకాదు పలు వాహనాలు ఏళ్ల క్రితం నాటివి కావడంతో వాటి స్థానంలో నాలుగు కొత్త వాహనాలను రూ.48లక్షలతో కొనుగోలు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ ఏడాది జూన్ 29న నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చారు. అయితే టేబుల్ ఎజెండాగా చేర్చడంపై బీజేపీతో పాటు బీఆర్‌ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో ఆమోదం లేకుండానే సమావేశం వాయిదా పడింది. మెజార్టీ సభ్యులు వ్యతిరేకించడంతో చైర్‌పర్సన్ ఎజెండా అంశాల ఆమోదం కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
నాలుగు ట్రాక్టర్లు కూడా ..
అలాగే నాలుగు ట్రాక్టర్లు సైతం కొనుగోలు చేయాలని నిర్ణయించిన అధికారులు వాటికి గత నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ట్రాలీతో కూడిన ట్రాక్టర్లను సరఫరా చేసేందు కోసం రూ.39లక్షలతో ఆన్‌లైన్ టెండర్లు చేపట్టారు. సికింద్రాబాద్‌కు చెందిన యువ కేంద్రీయ ఉద్యోగ అనే ఏజెన్సీ 1.5 లెస్‌కు దాఖలు చేసింది. సింగిల్ టెండర్ దాఖలుతో సరఫరా బాధ్యతలను సదరు ఏజెన్సీకే అప్పగించారు. ఈ మేరకు గత నెల 28న అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ నెలాఖరులోగా సంబంధిత ఏజెన్సీ ట్రాక్టర్లను సరఫరా చేయాల్సి ఉంది.
పర్యావరణ పరిరక్షణకు దోహదం
డిజల్, పెట్రోల్‌తో నడిచేవి కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ సైతం అలాగే సూచించారు. ఈ మేరకు చెత్త సేకరణ కోసం ఆరు నాలుగు చక్రాల వాహనాల(ఆటోల) కొనుగోలుకు టెండర్లు నిర్వహిస్తున్నాం. 7న ఖరారు చేస్తాం. త్వరలోనే వాహనాలు రానున్నాయి. పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఆదాకు తోడ్పడనున్నాయి.
– అరుణ్‌కుమార్, మున్సిపల్ ఇంజనీర్
కలెక్టర్ చొరవతో..
ఎజెండా అంశాలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా అత్యవరమైన కొన్ని అంశాలను ఆమోదించారు. ఇందులో కౌన్సిల్ ప్రతిపాదించిన నాలుగు కాకుండా మరో రెండింటిని అదనంగా చేర్చి చెత్త సేకరణకు డిజిల్‌వి కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రూ.90లక్షల వ్యయంతో ఆరు వాహనాల కొనుగోలుకు అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల 7వరకు ఆన్‌లైన్‌లో దాఖలుకు గడువు విధించారు. అదేరోజు ఖరారు చేసి కాంట్రాక్టర్లను ఎంపిక చేయనున్నారు. నెలాఖరులోగా ఈవీలను అందించేలా గడువు విధించనున్నట్లు సమాచారం. ఈ వాహనాల కొనుగోలు ద్వారా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తోంది. చార్జీంగ్‌తో నడిచే ఈ వాహనాల ద్వారా శబ్దం రాకపోవడంతో పాటు ఎలాంటి పొగ వెదజల్లదు.


