బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి
ఆదిలాబాద్‌రూరల్: బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆదిలాబాద్ రూరల్ ఎంపీడీవో సమావేశ మందిరంలో ప్రధానోపాధ్యాయులతో బడిబాట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యులు, 15 సంవత్సరాలు నిండిన వయోజనులు తప్పనిసరిగా అక్షరాస్యులుగా మారాలన్నారు. అందుకు గ్రామంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఐకేపీ సిబ్బంది తప్పనిసరిగా డోర్ టు డోర్ విజిట్ చేయాలన్నారు. కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సుజాత ఖాన్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామసభ నిర్వహించాలన్నారు. 7న విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్‌ను అప్డేట్, 8 నుంచి 10 వరకు డోర్ టు డోర్ సర్వే, 11న సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రెటరీ కందుల గజేందర్, అధికారులు సత్యనారాయణ, ఎంఈవో కంటె నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.


