Telangana Crime News: వివాహేతర సంబంధం..! నిందితులను పట్టించిన సెల్‌ఫోన్‌..!!
Sakshi News home page

వివాహేతర సంబంధం..! నిందితులను పట్టించిన సెల్‌ఫోన్‌..!!

Sep 21 2023 1:56 AM | Updated on Sep 21 2023 8:06 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త మరో ముగ్గురితో కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12న నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన అబ్దుల్‌ నదీమ్‌ తాహెర్‌(28) పటాన్‌చెరు మండలం లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్యకు గురయ్యాడు. మృతుడి సెల్‌ఫోన్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

అందులో మొఘల్‌పూర్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఇంకా ఆమె భర్త షహజాద్‌కు ఈ వ్యవహారం రెండు నెలల క్రితమే తెలిసింది. అతడిని మందలించినా తీరులో మార్పు రాలేదు. ఇక హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉన్న సోదరి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని హత్యకు పథక రచన చేశాడు. అందులో భాగంగా షహజాద్‌ తన బంధువు గౌస్‌ నుంచి కత్తులు, గొడ్డలి సేకరించాడు. స్నేహితులు షబ్బీర్‌ అహ్మద్‌, ఎజాజ్‌ అలీ సహాయం తీసుకున్నాడు.

టోలీచౌకీకి నదీమ్‌ వచ్చాడని తెలుసుకున్న అతడు ఇదే విషయమై మాట్లాడుకుని పరిష్కరించుకుందామని అందరూ ఓ హోటల్లో కలిశారు. ఇక్కడ వద్దని సంగారెడ్డిలోని ఓ దాబాకు వెళ్దామని నమ్మించారు. నదీమ్‌, షహజాజ్‌ బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో లక్డారం గేటు సమీపాన వచ్చేసరికి నదీమ్‌ మూత్రవిసర్జనకు ఆగాడు. అక్కడ సీసీ కెమెరాలు లేవని ధ్రువీకరించుకుని అతడితో వారు గొడవ పడ్డారు. పథకం ప్రకారం గొడ్డలి, కత్తితో మెడపై దాడి చేయగా అతను అక్కడికక్కడే మరణించాడు. తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌ తరలించారు. అయితే మరో నిందితుడు గౌస్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement