ఆదిలాబాద్: బేల మండలకేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బేలలో పలు ప్రభుత్వ శాఖలకు సరైన కార్యాలయ భవనాలు, మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని తెలిపారు. అన్ని శాఖలను ఒకే సముదాయంలోకి తీసుకువస్తే సేవలు వేగంగా, సులభంగా అందుతాయని వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.


