కై లాస్‌నగర్: రిమ్స్ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల అవినీతి మాయాజాలం కొనసాగుతుందనే విమర్శలున్నాయి. ఉద్యోగ నియామకాల్లో నిబంధనలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కాసులిచ్చిన వారికే పోస్టులను కట్టబెడుతూ అందినకాడికి దండుకుంటున్నట్లుగా వినిపిస్తోంది. దళారులను నియమించుకుని నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. పర్యవేక్షించాల్సిన అధికారులు వారికి వంతపాడుతుండడంతో ఆగడాలు శృతి మించుతున్నట్లుగా తెలుస్తోంది.
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలదే హవా..
ఉమ్మడి జిల్లా పరిధిలోని పేదలకు రిమ్స్ ఆరోగ్య వ ర ప్రదాయానిగా నిలుస్తోంది. దీనికి అనుబంధంగానే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలందిస్తోంది. ఇక్కడికి వచ్చే రోగులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ప్రతి పాదికన ఉద్యోగులను నియమిస్తోంది. జిల్లా ఉపాధి కల్పనశాఖ ద్వారా ఎంప్యానల్ కలిగిన ఏజెన్సీ లకు మాత్రమే నియామక బాధ్యతలు అప్పగిస్తోంది. ఈమేరకు కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీలు ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకున్నా తమ ఆధీనంలో పనిచేసే ఉద్యోగులకు రెగ్యులర్‌గా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పీఎఫ్, జీఎస్టీని ఎప్పటికప్పుడు జమచేయాలి. కానీ ఇలాంటి నిబంధనలు పాటించని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలదే రిమ్స్ ఉద్యోగ నియామకాల్లో హవా కొనసాగుతుండడం గమనార్హం.
కాసులిస్తే నిబంధనలు బలాదూర్
పలు ఏజెన్సీలు ఉద్యోగ నియామకాల్లో నిబంధనలకు పాతరేస్తున్నాయి. వాస్తవానికి సదరు ఏజెన్సీ భర్తీ చేసే పోస్టులు, అవసరమైన విద్యార్హతలు, రోస్టర్ పాయింట్ తెలిపేలా తొలుత పేపర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. అందిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయాలి. కానీ ఇటీవల రిమ్స్‌లో అలా జరగడం లేదు. పోస్టులు వచ్చిన సంగతి కూడా తెలియకుండానే దొడ్డిదారిన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు ఇటీవల మంజూరైన 50 పోస్టులను ఇలానే అమ్ముకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. పర్యవేక్షించాల్సిన ఓ అధికారి అనుగ్రహంతోనే ఆ ఏజెన్సీలు అడ్డదారిలో పోస్టులను భర్తీ చేశారనే ఆరోపణలున్నాయి. ఒక్కోపోస్టుకు రూ.80వేల నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేశారనే విమర్శలు లేకపోలేదు. ఇదే కాదు శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల భర్తీలోనూ ఇదే తంతు జరిగినట్లుగా ఆరోపణలున్నాయి.
క్రిటికల్ పోస్టుల భర్తీపై సందేహాలు!
రిమ్స్‌కు అనుబంధంగా కొత్తగా క్రిటికల్ కేర్ విభాగాన్ని ప్రారంభించారు. ఇందులో సుమారు 30కి పైగా పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఔట్‌సోర్సింగ్ ద్వారానే భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఆసుపత్రిలోని కీలకమైన అధికారులు, ఉద్యోగులు కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే ఈ పోస్టులకు తమకు తెలిసిన వారిని ఎంపిక చేసుకుని సిద్ధంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారా అర్హతలు కలిగిన నిరుద్యోగులకు అన్యాయం జరిగే అవకాశముంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల స్పందన ఆసక్తికరంగా మారింది.
రిమ్స్ ఆసుపత్రి
వీటికి కేటాయించిన పోస్టుల సంఖ్య 800
రిమ్స్‌కు కేటాయించిన ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు 4


