ఆ రెండే నా ఫేవరెట్‌ మ్యాచ్‌లు: కోహ్లి

Virat Kohli Picks His Two Favourite International Matches - Sakshi

ముంబై: ప్రపంచ క్రికెట్‌లో పరుగుల మెషీన్‌గా, సచిన్‌ టెండూల్కర్‌ వారసుడిగా మన్ననలు అందుకుంటున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కెరీర్‌లో ఇప్పటివరకూ ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడాడు.  భారత్‌కు ఇప్పటికే అనేక విజయాలను అందించిన ఘనత కోహ్లిది.  అంటే కోహ్లికి భారీ సంఖ్యలోనే ఫేవరెట్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉంటాయని సగటు క్రికెట్‌ అభిమాని అనుకుంటాడు. కానీ కోహ్లి ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌ల్లో రెండు ఫేవరెట్‌ మ్యాచ్‌లను ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యకరమైన విషయం. తనకు రెండే ఫేవరెట్‌ అంతర్జాతీయమ్యాచ్‌లు ఉన్నాయనే విషయాన్ని కోహ్లినే స్వయంగా చెప్పాడు. అందులో ఒకటి 2011 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ కాగా, రెండోది 2016 వరల్డ్‌ టీ20లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అట. ఒక వరల్డ్‌కప్‌లో భాగమైన 9 ఏళ్ల నాటి మ్యాచ్‌ ఒకటైతే, రెండోది ఆసీస్‌పై దూకుడుగా ఆడి వరల్డ్‌ టీ20లో సెమీస్‌కు చేర్చిన మ్యాచ్‌ కావడంతో ఆ రెండు తన ఫేవరెట్‌ మ్యాచ్‌లను  కోహ్లి తెలిపాడు. ధోని సారథ్యంలోని 2011 వన్డే వరల్డ్‌కప్‌లో కోహ్లి కీలక సమయంలో 35 పరుగులు సాధించి విజయానికి బాటలు వేశాడు. (‘సెహ్వాగ్‌ వేరే దేశానికి ఆడుంటే మరెన్నో రికార్డులు’)

సచిన్‌ విఫలమైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి.. గంభీర్‌తో కలిసి 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి బాటలు వేశాడు. ఇక 2016లో ఆసీస్‌తో మొహాలీలో మార్చి 27వ తేదీన జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అజేయంగా 82 పరుగులు సాధించాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో కోహ్లి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. భారత్ 14 ఓవర్లు ముగిసే సమయానికి రోహిత్ శర్మ (12), శిఖర్ ధావన్ (13), సురేశ్ రైనా (10), యువరాజ్ సింగ్ (21) వికెట్లు చేజార్చుకుని 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లి చెలరేగిపోయి ఆడాడు. ప్రత్యేకంగా చివరి ఓవర్లలో తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించి ఆసీస్‌కు చుక్కలు చూపించాడు. దాంతో భారత్‌ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది.  కాగా,  ప్రేక్షకులు లేని క్రికెట్‌ మ్యాచ్‌లపై కోహ్లి మాట్లాడుతూ..  ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించవచ్చన్నాడు. కానీ ఆటలో మ్యాజిక్‌ అనేది మిస్‌ అవుతుందన్నాడు. ప్రేక్షకుల సందడి లేకుండా మ్యాచ్‌ల్లో మజా ఉండదన్నాడు. మూసేసిన స్టేడియల్లో మ్యాచ్‌లు నిర్వహించే ప్రత్యామ్నాయంపై  క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(వార్నర్‌ కుమ్మేస్తున్నాడుగా..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top