ప్రతికుటుంబంలో భాగమయ్యా! | Mann Ki Baat: Modi strongly bats for nature conservation | Sakshi
Sakshi News home page

ప్రతికుటుంబంలో భాగమయ్యా!

May 29 2017 1:04 AM | Updated on Aug 29 2018 8:36 PM

ప్రతికుటుంబంలో భాగమయ్యా! - Sakshi

ప్రతికుటుంబంలో భాగమయ్యా!

మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’ను ఎప్పుడూ రాజకీయ వేదికగా చూడలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

మన్‌ కీ బాత్‌ రాజకీయ వేదిక కాదు
► ఈ కార్యక్రమం ప్రసంగాల పుస్తకం విడుదల స్ఫూర్తినిచ్చింది
► పారిశుద్ధ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి
►  రంజాన్‌ మాసారంభ శుభాకాంక్షలు
► జయంతి సందర్భంగా సావర్కర్‌ను గుర్తుచేసుకున్న మోదీ


న్యూఢిల్లీ: మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’ను ఎప్పుడూ రాజకీయ వేదికగా చూడలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ఏకపాత్రాభినయంగా మారిందన్న విపక్షాల విమర్శలను సున్నితంగా తిప్పికొట్టారు. ఆదివారం మన్‌ కీ బాత్‌లో ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రతి కుటుంబంలో సభ్యుడినయ్యాను. రోజువారీ సమస్యలపై నా కుటుంబంతో మాట్లాడుతున్నట్లుంది’ అని తెలిపారు. చాలా మంది ఇదే అభిప్రాయాన్ని తనకు లేఖల రూపంలో చేరవేస్తున్నారన్నారు. 30 నిమిషాల నిడివిగల కార్యక్రమంలో పర్యావరణం, యోగా, స్వాంతంత్య్ర యోధుల గురించి మోదీ మాట్లాడారు.

ముస్లిం సోదరులకు ప్రధాని రంజాన్‌ మాసారంభ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఐకమత్యం, శాంతి సామరస్యాలు పెరిగేలా ప్రార్థనలు చేయాలని కోరారు. ‘వివిధ విశ్వాసాలను పాటించేవారు, దేవుణ్ణి నమ్మనివారు, విగ్రహారాధనను నమ్మేవారు, వ్యతిరేకించేవారంతా కలసి ప్రశాంతంగా జీవించటమే 125 కోట్ల మంది ప్రజలున్న భారత్‌ గొప్పతనం. మన పూర్వీకులు ఇలాంటి అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించారు. అందుకు మనమంతా అదృష్టవంతులం’ అని మోదీ పేర్కొన్నారు.

అక్బర్‌ సాబ్‌ ధన్యవాద్‌!
రెండ్రోజుల క్రితం తన మన్‌ కీ బాత్‌ ప్రసంగాల పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ఆవిష్కరించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ‘ఓ సామాన్య పౌరుడిగా ఇది నాకు స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం’ అని తెలిపారు. ఈ పుస్తకంలో పేర్కొన్న వివిధ అంశాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అందించిన అబుదాబికి చెందిన ఆర్టిస్టు అక్బర్‌ను ప్రశంసించారు.

శభాష్‌ అఫ్రోజ్‌!
జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చెత్త నిర్వహణ కార్యక్రమం నిర్వహించనుందని ప్రధాని వెల్లడించారు.  4 వేల నగరాలు, పట్టణాల్లో తడి, పొడి చెత్త సేకరణ ప్రారంభం కానుందన్నారు.

ముంబైలోని వర్సోవా బీచ్‌ను చెత్తరహితంగా తీర్చిదిద్దిన పర్యావరణవేత్త అఫ్రోజ్‌ షా, అతని బృందాన్ని  ప్రశంసించారు. 2015 అక్టోబర్‌లో ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా మార్చటంలో అఫ్రోజ్‌ పాత్ర కీలకమని మోదీ అభినందించారు. జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతమైన రియాసీ బ్లాక్‌ను ఓడీఎఫ్‌ (బహిరంగ మలవిసర్జన రహిత) గ్రామంగా ప్రకటించారు. ఈ విజయంలో భాగస్వాములైన గ్రామస్తులకు ముఖ్యంగా మహిళలను  ప్రశంసించారు.

నిర్మాణాత్మక విమర్శ అవసరమే!
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సంస్థలు చేపడుతున్న సర్వేలను ప్రధాని స్వాగతించారు. నిర్మాణాత్మక విమర్శల వల్ల ప్రజాస్వామ్యం  బలోపేతమవుతుందన్నారు. ‘ఒపీనియన్‌పోల్స్, సర్వేలు ప్రభుత్వ పనితీరును ప్రశంసించాయి. కొందరు సంపూర్ణమద్దతు తెలపగా కొందరు మా తప్పులను ఎత్తిచూపారు. అందరికీ ధన్యవాదాలు. బలహీనతలను, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు ఇవి అవసరం. నిర్మాణాత్మక విమర్శ ప్రజాస్వామ్యానికి బలం. ప్రజాస్వామ్యానికి ఇలాంటి ప్రయత్నాలు చాలా ముఖ్యం’ అని మన్‌కీ బాత్‌ సందర్భంగా మోదీ తెలిపారు.

మూడు తరాల యోగా సెల్ఫీ
జూన్‌ 21న జరగనున్న మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుటుంబంలోని మూడు తరాలు యోగా చేస్తూ సెల్ఫీలు తీసుకుని తనకు పంపాలన్నారు. నరేంద్రమోదీ లేదా ‘మైగవ్‌’ యాప్‌ ద్వారా ఈ చిత్రాలను పంపాలన్నారు. నిన్న, నేడు, రేపుల అద్భుతమైన కలయికగా ఈ సెల్ఫీ మారుతుందని.. ఉజ్వలమైన రేపటి భవిష్యత్తును గుర్తుచేస్తుందని మోదీ తెలిపారు.

గతంలో బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు కూతుళ్లతో సెల్ఫీలు తీసుకుని పంపాలని మోదీ కోరిన సంగతి తెలిసిందే. ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ 134వ జయంతి సందర్భంగా ఆయన్ను మోదీ స్మరించుకున్నారు. ‘చాలా మంది తమ యవ్వనమంతా జైల్లోనే గడిపారు. మరికొందరు యువకులుగానే ఉరికంబమెక్కారు. నాటి వారి త్యాగ ఫలితమే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఒక్కసారి అండమాన్‌ నికోబార్‌ దీవులకు వెళ్తే అక్కడి నీటిని కాలాపానీ అని ఎందుకంటారో తెలుస్తుందన్నారు.

నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
నాలుగు దేశాల పర్యటనలో భాగంగా మోదీ నేటి నుంచి జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటించనున్నారు. మే 29 నుంచి జూన్‌ 3 వరకూ సాగే ఈ ఆరు రోజుల పర్యటనలో ద్వైపాక్షిక, ఆర్థిక సహకారం బలోపేతంపై ఆ దేశ అధినేతలతో చర్చిస్తారు. ఆర్థిక సంబంధాల్ని మరింత బలోపేతం చేయడమే పర్యటన ఉద్దేశమని మోదీ పేర్కొన్నారు. మే 29న జర్మనీ చేరుకున్న ప్రధాని ఆ దేశ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌తో చర్చలు జరుపుతారు.

Advertisement
 
Advertisement
Advertisement