భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తీసిన లేటెస్ట్ సినిమా 'రామాయణ’ గురువారం(నవంబర్ 05) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తొలిరోజే కనక వర్షం కురిపించేలా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది కూడా. ముఖ్యంగా అందరి నుంచి పాజిటివ్ టాక్ రావడం విశేషం. అంతేగాదు అందుకు సంబంధించిన బీటీఎస్ వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.
ముఖ్యంగా రావణుడి పాత్రలో ఒదిగిపోయిన యశ్ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూవీలోని రావణుడి పాత్ర కోసం దర్శకుడు నితేష్ తివారీ ఎంత కష్టపడ్డారో ఆర్ట్ డైరెక్టర్ రమేష్ సవివరంగా వెల్లడించారు. ఈ మూవీ కోసం వందలాది సెట్‌లను క్రియేట్ చేసినట్లు తెలిపారు. అంతలా చేశాం కాబట్టి ఇవాళ ఈ రేంజ్‌లో ప్రశంసలు వెల్లువెత్తాయని అన్నారు. 2024 ఫిబ్రవరిలోనే ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఉన్న ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌లో ఆ సినిమా సెట్ల అసలు నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు.
ఈ సినిమా కోసం సుమారు 150కి పైగా సెట్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే ఏ సెట్ ఖరారు కాదని.. ఎన్నో వేయగా.. చివరికి ఖరారు అయ్యేది ఏ పది నుంచి 15 విభిన్న సెట్‌లని అన్నారు. ఇందుకోసం ఎన్నో విభిన్న రూపాలు, వైవిధ్యలు అవసరమవుతాయని అన్నారు. అయితే ఇందులో రావణుడు సింహాసనంపై కూర్చోనే సన్నివేశం అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాలలో ఒకటి. అది కూడా ఒక రాక్షస రాజుగా అతని బ్రహ్మండమైన ఉనికిని ప్రతిబింబించేలా రూపిందించడం విశేషం.
ఇది విజ్యువల్ ఎఫెక్ట్ క్రియేషన్ మాత్రం కాదు. ముందుగా మట్టితో ఒక నమునా తయారు చేసి, అచ్చు పోశారట. ఆ తర్వాత ఫైబర్‌ని ఉపయోగించి సింహాసనానికి ఒక ఆకృతిని ఇచ్చారని చెప్పారు. అంతేగాదు ఇందులో సుమారు 24 క్యారెట్ల బంగారు రేకులను ఉపయోగించి తీర్చిదిద్దడం అత్యంత విశేషం. అంతేకాదండోయ్ ఆ సింహాసనాన్ని నిర్మించడానికి నాలుగు నెలల సమయం పట్టిందని, నిర్మాణానికే కోటి రూపాయల పైనే ఖర్చు అయ్యిందని తెలిపారు. అలాగే రావణుడి ఆభరణాల రూపకల్పనలో సైతం అంతే ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు.
నిజానికి రావణుడి లంక బంగారంతో నిర్మించారని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఆ వైభవం చూపించేలా ఇంతలా కష్టపడాలన్ని వచ్చిందని చెప్పుకొచ్చారు ఆర్ట్ డైరెక్టర్ రమేశ్. అలాగే రావణుడి వక్షస్థల కవచం రూపొందించడానికి కూడా చాలా కష్టపడినట్లు పేర్కొన్నారు. దీన్ని మొత్తం చేతితో తయారు చేసినట్లు తెలిపారు. అలాగే నటుడు మొత్తం ఆరుగంటలు సౌకర్యవంతంగా ధరించేలా చాలా కేర్ తీసుకున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ
అదీగాక రావణుడిని శివభక్తుడిగా చూపేందుకు ఆభరణాల్లో సర్పా ఆకృతులను పొందుపరిచామని అన్నారు. అలాగే రావణుడి ఇత్తడి, బంగారు పూత పూసిన ఆభరణాల కోసం నీలం, నలుపు, ఆకుపచ్చ రంగులను ఉపయోగించినట్లు తెలిపారు. వీటిని అత్యద్భుతంగా ట్రైబ్ అమ్రపాలి డిజైనర్ బ్రాండ్ తీర్చిదిద్దినట్లు తెలిపారు. కేవలం ఈ ఒక్క రావణుడి పాత్ర కోసమే దాదాపు 130కి పైగా ఆభరణాలును తయారు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: రామాయణ: పార్ట్-1 మూవీ రివ్యూ


