కువైట్‌ బాధితుడికి మంత్రి సత్యకుమార్‌ భరోసా | - | Sakshi
Sakshi News home page

కువైట్‌ బాధితుడికి మంత్రి సత్యకుమార్‌ భరోసా

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

కడప సిటీ : కువైట్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన బండి రెడ్డి కిరణ్‌ను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చొరవ చూపారు. ఉపాధి కోసం కువైట్‌ వెళ్లిన కిరణ్‌ అక్కడ యజమాని, ఏజెంట్‌ కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు. తన కుమారుడి దీనస్థితిని వివరిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మంత్రి సత్యకుమార్‌ వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌కు లేఖ రాశారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తక్షణమే జోక్యం చేసుకుని కిరణ్‌కు అవసరమైన సాయం అందించాలని, ఆయనను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ లేఖలో కోరారు.

కీచక ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

ప్రొద్దుటూరు కల్చరల్‌ : స్థానిక ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన గణిత ఉపాధ్యాయుడు అట్లా నరసింహారెడ్డిని సస్పెండ్‌ చేసినట్లు ఉప విద్యాశాఖాధికారి శివప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం పాఠశాలలో జరిగిన సంఘటనపై విచారణ చేసి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక పంపామని ఆయన పేర్కొన్నారు. డీఈఓ ఉత్తర్వుల మేరకు గణిత ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

హాస్టల్‌ గదిలో విద్యార్థి ఆత్మహత్య

లక్ష్మీపురం : బ్రాడీపేటలోని ఓ కళాశాల హాస్టల్‌ విద్యార్థి మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పట్టాభిపురం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాలు.. వైఎస్సార్‌ కడప జిల్లా రాజంపేట మండలం మిట్టమీదపల్లె పంచాయతీ గొందివారిపల్లికి చెందిన సింగన సుబ్బ నరసయ్య కుమారుడు సింగన రవికిరణ్‌(20) ఓ కళాశాల హాస్టల్‌లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా రవికిరణ్‌ కిడ్నీలో రాళ్ల సమస్యతో పాటు కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా తెలిపాడు. అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఘర్షణలో ఇద్దరికి గాయాలు

టాస్క్‌పోర్స్‌ : మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో బుధవారం టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సర్పంచ్‌ ఎన్నికలలో ఇరువురు పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లు రెండు వర్గాలకు చెందిన వారికి గాయాలైననట్లు సమాచారం.

జాతీయస్థాయి పోటీకు ఎంపిక

వాల్మీకిపురం : మండలంలోని కొత్తమంచూరుకు చెందిన రైతు హరి కుమార్తె అలేఖ్య కలికిరి శ్రీనివాస జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. గత నెల మదనపల్లె సీటీఎంలో జరిగిన అండర్‌ 17 రాష్ట్ర స్థాయి నెట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. దీంతో అలేఖ్యను జాతీయస్థాయి నెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక చేసినట్లు స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీలు రమేష్‌, జయక్రిస్టిలు తెలిపారు. త్వరలోనే మధ్యప్రదేశ్‌లోని తాత్నాలో జరిగే అండర్‌ 17 జాతీయ స్థాయి నెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు.అలేఖ్యను పీడీ రెడ్డివరప్రసాద్‌, కళాశాల కరస్పాండెంట్‌ శ్రీధర్‌, గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement