– పోలీసులపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆగ్రహం
పులివెందుల : స్థానిక సంస్థల ఎన్నికలలో పోలీసుల తీరు దారుణంగా ఉందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన సర్పంచ్ అభ్యర్థులను తొండూరు, సింహాద్రిపురం మండలాలకు సంబంధించి పలువురు అభ్యర్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్థానిక పులివెందుల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అదుపులో ఉంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బుధవారం పులివెందుల రూరల్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులపై మండిపడ్డారు. ‘పోలీస్‌స్టేషన్‌లో నామినేషన్లు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమ పార్టీకి చెందిన సానుభూతి సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు కదా’ అని ప్రశ్నించారు. అంతకుముందు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్వగృహం వద్ద కనంపల్లెకు చెందిన పలువురు మహిళలు అర్థరాత్రి సమయంలో పోలీసులు తమ గ్రామానికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మొర పెట్టుకున్నారు. స్పందించిన ఎంపీ వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందుల పాలు చేయాలని పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయా అంటూ అక్కడే ఉన్న అర్బన్ సీఐ పురుషోత్తమరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తారస్థాయికి బాబు, లోకేష్ అరాచకాలు
– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి
వేంపల్లె ; స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజురోజుకీ అరాచకాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయని, పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ గూండాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేసిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్న మంత్రి లోకేష్, ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పచ్చ చొక్కా ధరించినట్లుగా వ్యవహరిస్తున్న డీఐజీ కోయా ప్రవీణ్‌లకు తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. పులివెందుల నియోజకవర్గ ప్రాంతంలో స్వేచ్ఛగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే పరిస్థితి లేకుండా చేశారన్నారు. నారా లోకేష్ ఆదేశాల మేరకే ఈ దారుణాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రజల చేత ఎన్నుకోబడాల్సిన ప్రజా ప్రతినిధులను మార్కెట్లో వేలం వేసి డబ్బులు తీసుకుని గుండాలకు, పోలీసులకు కప్పం కట్టి పదవులు పొందే సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని దునుమాడారు. రౌడీలు, గుండాలు, పోలీసులను అడ్డుపెట్టుకొని నామినేషన్లు వేయకుండా చేయడమేనా నీ చదువు, సంస్కృతి అని లోకేష్‌ను తూర్పారబట్టారు.


