కడప సిటీ : ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని‘ అన్న చందంగా తయారైంది చాగలమర్రి–వేంపల్లె జాతీయ రహదారి నిర్మాణ పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 660 కోట్ల భారీ నిధులు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. జిల్లా రవాణా ముఖచిత్రాన్ని మార్చాల్సిన ఈ కీలక ప్రాజెక్టు, భూ సేకరణ చిక్కులు, కూటమి ప్రభుత్వ పట్టింపులేనితనంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నిలిచిపోయింది. నత్తనడకన సాగుతున్న ఈ ప్రక్రియతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
2024లోనే మంజూరైనా.. మొదలవని పనులు
చాగలమర్రి నుంచి వేంపల్లె వరకు 79 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లోనే సుమారు రూ. 660 కోట్లను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తయి, నేషనల్ హైవే అధికారులు కసరత్తు ప్రారంభించినప్పటికీ భూ సేకరణ విషయంలో జాప్యం జరగడంతో పనులు అటకెక్కాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పనులు పట్టాలెక్కేలోపే ఎన్నికలు రావడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా విస్మరించడంతో పనులు అసలే ప్రారంభం కాలేదు. కేంద్రం నిధులు సిద్ధంగా ఉంచినా, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి భూ సేకరణ పూర్తి చేయకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైల్వే, అటవీ శాఖల భూములే ప్రధాన అడ్డంకి
చాగలమర్రి, కె.రాజుపాలెం, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, వీఎన్ పల్లె, పెండ్లిమర్రి, వేంపల్లె మండలాల మీదుగా ఈ రహదారి నిర్మాణం జరగాల్సి ఉంది. ఎర్రగుంట్ల–ప్రొద్దుటూరు మధ్య నాలుగు వరుసలు, మిగతా ప్రాంతాల్లో రెండు వరుసల రహదారి నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు 630 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూమి అవసరం కాగా, ఇప్పటివరకు కేవలం 383 ఎకరాలు మాత్రమే సేకరించారు. ముఖ్యంగా వీరపునాయునిపల్లె మండలం మర్రిపల్లె వద్ద ఉన్న అటవీ శాఖ భూములు, ఎర్రగుంట్ల వద్ద ఉన్న రైల్వే శాఖ భూముల సేకరణకు అనుమతులు రాకపోవడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం
‘చాగలమర్రి–వేంపల్లె రోడ్డు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. రైల్వే, అటవీ శాఖలకు సంబంధించిన భూ సేకరణ సమస్యలకు త్వరలోనే మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి.‘
– పి. సురేంద్రనాథ్‌రెడ్డి, ఏఈ, నేషనల్ హైవే, కడప
అడుగు ముందుకు పడని చాగలమర్రి–వేంపల్లె హైవే రోడ్డు పనులు
భూ సేకరణలో తీవ్ర జాప్యం,
అడుగడుగునా అడ్డంకులు
ప్రభుత్వ నిర్లక్ష్యంపై స్థానికులు,
వాహనదారుల ఆగ్రహం


