మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణం సీటీఎం రోడ్డులోని ఎస్టేట్లో బుధవారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు తీవ్రంగా గాయపడింది. భర్త సుబ్రహ్మణ్యాన్ని కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న రాధమ్మ(50) మదనపల్లె మున్సిపాలిటీలో కార్మికురాలిగా పనిచేస్తోంది. బుధవారం తెల్లవారుజామున విధులకు వెళ్లే ముందు వంట కోసం కట్టెల పొయ్యిలో టిన్నర్ వేసి వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి ఆమెను చుట్టుముట్టాయి. కేకలు విన్న స్థానికులు మంటలార్పి ఆమెను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


