చక్రాయపేటలో టీడీపీ గూండాల వీరవిహారం
సాక్షి కడప : అధికారం అండగా పచ్చమూక బరి తెగించింది. ఇటీవల జరిగిన పోరు, ప్రాదేశిక ఎన్నికల్లో చేసిన విధ్వంసకాండనే పల్లెల్లోనూ పునరావృతం చేసింది. ఫలితంగా పల్లె రక్తమోడింది. ఖాకీల సమక్షంలోనే టీడీపీ దళం ఊరిమీద పడి విధ్వంసరచన చేసింది. పార్టీ గుర్తు లేకుండా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ టీడీపీ రక్తచరిత్ర రాసింది. ఎక్కడ చూసినా నామినేషన్ల కేంద్రాల వద్ద టీడీపీ గుండాలు, రౌడీలను దించి కర్రలు, రాడ్లతో రౌడీయిజం చేసింది. వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై దాడులకు దిగడం, నామినేషన్ పత్రాలు చింపివేయడం, భయపెట్టడం లాంటి చర్యలతో పల్లె తల్లడిల్లింది.
పులివెందులలో మారని తీరు
● పులివెందుల మండల పరిధిలోని ఇ.కొత్తపల్లెలో సర్పంచ్ అభ్యర్థుల దగ్గరినుంచి దౌర్జన్యంగా నామినేషన్ పత్రాలను లాక్కొని చింపివేశారు. అలాగే వేముల, చాగలేరులో పచ్చమూకలు రెచ్చిపోయారు. కనంపల్లె గ్రామానికి చెందిన బుక్కే మల్లేశ్వరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వస్తుండటంతో టీడీపీ నేత పుష్పనాథరెడ్డి, ఆయన అనుచరులు మహిళలు అని చూడకుండా చంపుతామని బెదిరించారు.
● సింహాద్రిపురం మండలంలో నామినేషన్లు వేయకుండా పచ్చరౌడీలు రాళ్ల దాడులు చేశారు. టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి సోదరుడు భరత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పచ్చగుండాలు వైఎస్సార్సీపీ వారిపై దాడులకు తెగబడ్డారు. సింహాద్రిపురం క్లస్టర్లో సాయంత్రం పోలీసులు, టీడీపీ నాయకులు ఎంత సేపటికి కూడా నామినేషన్లు వేయనీయకపోవడంతో వైఎస్సార్సీపీ మహిళా అభ్యర్థులు ఒక్కసారిగా నామినేషన్ వేయడానికి వెళ్లారు.దీంతో టీడీపీ నాయకులు రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి తన సొంత పంచాయతీ కోవరంగుంటపల్లెలో నామినేషన్ పరిశీలనకు వెళుతుండగా బలపనూరులో పోలీసులు అడ్డగించి అరెస్టు చేసి సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
● తొండూరులో నామినేషన్ వేసేందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. భద్రంపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వెంకట్రామిరెడ్డి భార్య విజయమ్మ, కోడలు ఉమాదేవిలతోపాటు పలువురు తొండూరు సాయిబాబా గుడి సమీపంలో ఉన్న సచివాలయం నామినేషన్ కేంద్రం వద్దకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ గూండాల కర్రలతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ఉమా దేవి చేతికి బలమైన రక్తపు గాయాలయ్యాయి. అలాగే బోడివారిపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గురుమోహన్‌రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లగా టీడీపీ గూండాలు వెనక్కి వెళ్లాలంటూ బెదిరించారు. అతను ధైర్యంగా అడుగు ముందుకేయడంతో అదే గ్రామానికి చెందిన చిన్న కుళ్లాయిరెడ్డి, పెద్ద కుళ్లాయిరెడ్డిలతోపాటు మరికొంతమంది టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. దీంతో అతని తలకు రక్తపు గాయాలయ్యాయి.
అడ్డుకున్న డీఎస్పీ...ఏకపక్షంగా పోలీసులు
పులివెందుల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అరాచకం జరుగుతున్నా అడ్డుకోవాల్సిన పోలీసుశాఖ ఏకపక్షంగా టీడీపీకి గులాంగిరీ చేసింది. పోలీసులందరినీ సక్రమ మార్గంలో నడిపిస్తూ తాను కూడా ముందుండి శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ వైఎస్సార్ సీపీ మద్దతుదారులను అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదివరకు పుర, ప్రాదేశిక ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించిన డీఎస్పీ తాజాగా పల్లె పోరులోనూ అదే రీతిన ప్రవర్తించారు. బుధవారం వేములలో నామినేషన్ పత్రాలను తీసుకుని వెళుతున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో రగలిపోయారు. వేంపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచు స్థానానికి పోటీ చేస్తున్న షబ్బీర్‌తోపాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో వెళుతున్న వారిని పోలీసులు అడ్డగించారు. చుట్టూ ముళ్లకంచె వేసి లోనికి పంపకుండా అడ్డుకోవడంతో అభ్యర్థితోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి.
నేతల హౌస్ అరెస్ట్
వేంపల్లె : పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎం.రవి కుమార్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అర్ధ కిలోమీటర్ ముందే పోలీసులు ముళ్ల కంచె వేసి అడ్డుకున్నారు. టీడీపీ మద్దతుదారులతో నామినేషన్లు వేయిస్తూ వైఎస్సార్సీపీ మద్దతుదారులను నామినేషన్లు వేయకుండా పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు.
వేంపల్లెలో ప్రజాస్వామ్యం అపహాస్యం
వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై టీడీపీ మూకలు అడ్డుకుని రౌడీయిజం చేశాయి. నందిపల్లె గ్రామపంచాయతీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థిని మారం సులోచనను మహిళ ఆని చూడకుండా టీడీపీ గుండాలు తోసి వేశారు. అలాగే వేంపల్లెలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తన నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలు సర్పంచ్, వార్డు అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు బయలుదేరగా.. అర్ధ కిలోమీటర్ ఉండగానే బిడాలమిట్ట వీధి రోడ్డులో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ సతీష్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అటువైపు, నామినేషన్ కేంద్రం పరిసరాల్లో టీడీపీ శ్రేణులు రాళ్లు, పెట్రోల్ బాటిళ్లు, కర్రలు ప్రోగు చేసుకొని వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే అపహాస్యం చేస్తున్నారని.. అందుకే వైఎస్సార్సీపీ మద్దతుదారులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని’ వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. అలవలపాడు క్లస్టర్ పరిధిలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు, సానుభూతిపరులను పచ్చగూండాలు అడ్డుకున్నారు. మహిళలపైన దాడులు చేశారు.
చక్రాయపేట మండలం సురభిలో పచ్చ గూండాలు వీరవిహారం చేశారు. రాయచోటి ప్రాంతం నుంచి వచ్చిన వందలాది మంది పచ్చమూకలు ఒక్కసారిగా ఊరిపైకి దండెత్తి వచ్చారు. రోడ్డుపై కర్రలు పట్టుకుని తిరుగుతూ వైఎస్సార్ సీపీ మద్దతుదారులనే కాకుండా షాపుల వారిని కూడా బెదిరించారు. సురభి గ్రామంలోని నాగలగుట్టపల్లె నామినేషన్ కేంద్రం వద్దకు ఉదయాన్నే చేరుకున్న టీడీపీ వర్గీయులు నామినేషన్ వేయడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ వర్గీయులను అడ్డుకున్నారు. ఈ సందర్భంలో రాళ్ల వర్షం కురిపించారు. దీంతో గొందికి చెందిన గడ్డంవారిపల్లె మాజీ సర్పంచ్ మోహన్,ఇదేపంచాయతీకి చెందిన బ్రహ్మదేవుని ఆనందరెడ్డి,మహదేవపల్లెకు చెందిన హనుమంతు,నెరుసుపల్లె గ్రామం దేవరగుట్టపల్లెకు చెందిన సాయితో పాటు మరి కొందరు వైఎస్ఆర్సీపీ వర్గీయులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం టీడీపీ గూండాలు నాగలగుట్టపల్లెలో ఉన్న మాజీ ఎంపీపీ మాధవి బాలకృష్ణ ఇటుకల ఫ్యాక్టరీపై దాడి చేశారు. తలుపులు పగుల గొట్టి అక్కడ ఉన్న సామాగ్రిని చెల్లాచెదురు చేశారు.అక్కడే ఉన్న సుమారు 30పైగా ద్విచక్ర వాహనాలతో పాటుకార్లు స్కార్పియో బొలేరో వాహనాలను సైతం ధ్వంసం చేశారు. చక్రాయపేటలో టీడీపీ గూండాలు వైఎస్ఆర్ సీపీ వారిపై కవ్వింపు చర్యలకు దిగి పెట్రోల్ బాటిళ్ల్లకు నిప్పంటించి దాడికి దిగారు. దీంతో వైఎస్సార్సీపీ వర్గీయులు ధైర్యంగా ఎదుర్కొని నామినేషన్లు వేశారు.


