కోరం లేదనా.. ఇష్టం లేకనా..! | - | Sakshi
Sakshi News home page

కోరం లేదనా.. ఇష్టం లేకనా..!

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

● చాపాడు ఉప మండల అధ్యక్షుడి

ఎన్నిక వాయిదా

● అధికార పార్టీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

చాపాడు : అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బట్టబయలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ, మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలంలో మాత్రం ఉప మండల అధ్యక్ష పదవి కోసం అధికార టీడీపీ నేతలు సాగిస్తున్న వర్గపోరు రచ్చకెక్కింది. గురువారం జరిగిన ఎన్నికల్లో సోమాపురం ఎంపీటీసీ కొప్పోలి శివనరసింహులును ఎంపీపీగా ఎన్నుకున్నారు. అనంతరం ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించే సమయానికి ఎంపీటీసీలందరూ ఒక్కసారిగా సభ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ’కోరం’ లేదనే సాకుతో రిటర్నింగ్‌ అధికారి జుబేదా ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు.

అసలు కథ ఇదీ..

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచే ఉపాధ్యక్ష పీఠంపై చాపాడు ఎంపీటీసీ అన్నవరం సుధాకర్‌రెడ్డి, చియ్యపాడు–1 ఎంపీటీసీ పిచ్చిపాటి రాజేశ్వరి కన్నేశారు. ఇద్దరూ పట్టువీడకపోవడంతో మండల స్థాయిలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకరిని గెలిపిస్తే మరొకరు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉండటంతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఈ ఎన్నికను ఇప్పుడే నిర్వహించేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. వర్గ విభేదాలను కప్పిపుచ్చుకునేందుకే, కావాలని ఎంపీటీసీలను బయటకు పంపించి ‘కోరం’లేదనే నాటకానికి తెరలేపారని స్థానికులతో పాటు సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

బయటపడ్డ అసమ్మతి..

ఎన్నిక వాయిదా పడిన వెంటనే రేసులో ఉన్న పిచ్చిపాటి రాజేశ్వరి మండల కార్యాలయం వద్దే వేచి ఉండగా, అన్నవరం సుధాకర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 4 గంటలకు నూతన ఎంపీపీతో పాటు 12 మంది ఎంపీటీసీలను సన్మానించేందుకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి సుధాకర్‌రెడ్డి గైర్హాజరు కావడం ద్వారా పార్టీలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది.

శుక్రవారం కూడా వాయిదానేనా?

గురువారం వాయిదా పడిన ఈ ఎన్నిక శుక్రవారం కూడా జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, మరోసారి వాయిదా వేసేందుకే అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారని నియోజకవర్గంలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement