మైదుకూరు : పొలంలోని పంటకు సమృద్ధిగా సాగునీటిని అందించడం.. సాగు చేసిన పంటను కన్నబిడ్డలా చూసుకోవడం ఇవే ఎప్పుడూ రైతు ఆలోచనలు.. వర్షాభావంతో వ్యవసాయ బోరులోని నీరు అడుగంటడంతో శుక్రవారం కొత్త బోరు వేసేందుకు పూజా సామగ్రిని తీసుకొని వస్తూ మైదుకూరు మండలం గల్లావాండ్లపల్లెకు చెందిన ఓ రైతు మృత్యు ఒడిలోకి చేరిన సంఘటన గురువారం సాయంత్రం మైదుకూరు – బద్వేలు రహదారిలోని జీవీ సత్రం వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గల్లావాండ్లపల్లెకు చెందిన బాలగాని శివయ్య (35) అనే రైతు తన పొలంలో శుక్రవారం కొత్త బోరు వేయించేందుకు పూజ కోసం కావాల్సిన సామగ్రిని జీవీ సత్రంలో కొనుగోలు చేసి మోపెడ్‌పై తిరిగి గ్రామానికి బయల్దేరాడు. జీవీ సత్రం దాటిన కొద్దిసేపటికే గ్రామ శివారులోని మసీదు వద్ద సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బద్వేలు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో మోపెడ్‌పై నుంచి శివయ్య ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు తీవ్ర రక్తగాయాలు తగిలి ఆయన అక్కడికిక్కడే మృతి చెందాడు. సంఘటన జరగగానే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న శివయ్య భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుయ్యారు. అర్బన్ సీఐ హాజీవలి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.


