బ్రహ్మంగారిమఠం : పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. ఇప్పటికే మండలంలో రెవెన్యూ భూములు అధిక భాగం ఆక్రమణకు గురికాగా, తాజాగా ఆర్అండ్బీ స్థలాలపై కబ్జాదారుల కన్ను పడింది. బి.మఠం – మల్లేపల్లె రోడ్డులోని బాలుర ఉన్నత పాఠశాల ప్రహరీ గోడకు, ఆర్అండ్బీ రోడ్డుకు మధ్య సుమారు 15 అడుగుల ఖాళీ స్థలం ఉంది. గతంలో ఇక్కడ పేదలు చిన్న బంకులు ఏర్పాటు చేసుకోగా, రహదారి స్థలంలో ఆక్రమణలు ఉండకూడదని గత ప్రభుత్వ హయాంలో అధికారులు వాటిని తొలగించారు. అయితే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొందరు ఈ స్థలాన్ని ఏకంగా ఆక్రమించి, శాశ్వతంగా రేకుల షెడ్లు నిర్మిస్తూ ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ కబ్జా వ్యవహారం రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా, రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.


