ఖాజీపేట : తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు.. ఏకంగా 20 తులాల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. స్థానిక ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇంట్లో ఈ ఘటన జరగడం ఖాజీపేట వాసులను విస్మయానికి గురిచేసింది. ఒక ఘటన మరువకముందే మరో చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఖాజీపేట ప్రధాన రహదారిలో కనమర్లపాటి సత్యనారాయణ నివాసం ఉంటున్నారు. ఆయన భార్య అరుణ కుమారికి కంటి సమస్య తలెత్తడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులంతా కలిసి శుక్రవారం ఉదయం 8 గంటలకు తిరుపతికి వెళ్లారు. వైద్య పరీక్షలు ఆలస్యం కావడంతో వారంతా అక్కడే బస చేశారు. కాగా, ఇంటి ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు శనివారం సత్యనారాయణకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. వెంటనే ఆయన తన బంధువులను అప్రమత్తం చేయగా, వారు ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించారు. బీరువా తెరిచి ఉండటం, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని చూసి చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం తిరుపతి నుంచి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లోని సుమారు 20 తులాల బంగారం, 750 గ్రాముల వెండి చోరీకి గురైనట్లు గుర్తించారు. శనివారం సాయంత్రం ఖాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీ ఘటనపై సీఐ వంశీధర్ ఆదేశాల మేరకు కడప నుంచి క్లూస్ టీంను రప్పించి పరిశీలన చేశారు.
తమిళనాడులో వైవీయూ విద్యార్థుల అధ్యయనం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) ఎం.ఎస్‌సీ బోటనీ మూడో సెమిస్టర్ విద్యార్థులు పాఠ్యప్రణాళికలో భాగంగా తమిళనాడులో ఐదు రోజుల బొటానికల్ టూర్ నిర్వహించారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఎ.మధుసూదన్‌రెడ్డి, ప్రొఫెసర్ పులి చంద్ర ఓబుల్‌రెడ్డి నేతృత్వంలో నవంబర్ 10 నుంచి 14 వరకు కోయంబత్తూరు, ఊటీ, కున్నూరు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అటవీ జన్యుశాస్త్ర సంస్థ, భారత వృక్ష సర్వేక్షణ సంస్థ, ప్రభుత్వ బొటానికల్ గార్డెన్స్, సిమ్స్ పార్క్ తదితర ప్రాంతాలను సందర్శించి సుమారు 200 వృక్ష జాతులు, ఔషధ మొక్కల ప్రత్యేకతలపై అధ్యయనం చేశారు.


