మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని ఎల్లమ్మ గుడి వీధిలో ఆదివారం రాత్రి ఓ యువకుడు ఓ ఇంటిలో చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటి ప్రహరీపై నుంచి దూకిన అతన్ని అదే వీధికి చెందిన ఓ యువకుడు గుర్తించి దొంగ దొంగ అని కేకలు వేయడంతో దుండగుడు పారిపోయాడు. ఇంటి ప్రహరీ పై నుంచి దూకి ఇంటిలోకి చొరబడేందుకు యువకుడు ప్రయత్నించడం గుడిలో అమర్చిన సీసీ కెమెరాల పుటేజీలో కనిపిస్తోంది. ఈ విషయమై ఇంటి యజమాని నరసింహులు, వీధిలోని మరికొందరు మాట్లాడుతూ చోరీకి యత్నించిన సదరు యువకుడు అదే వీధిలో నివాసం ఉంటున్నాడని, తండ్రి మరణించడంతో తల్లితో కలిసి ఉంటూ జులాయిగా తిరుగుతుంటాడని తెలిపారు. ఎవరూ లేని ఇళ్లల్లో వస్తువులు, నగదు చోరీ చేస్తుంటాడని చెప్పారు. కొన్నాళ్ల కిందట ఓ ఇంటిలో నగదును దొంగతనం చేసిన ఆ యువకున్ని పోలీసులకు పట్టించగా వారు అతన్ని వదిలివేశారని, దాంతో వీధిలో తరచుగా దొంగతనాలు చేస్తున్నా అతనిపై ఫిర్యాదు చేయడం లేదని పేర్కొన్నారు.
ముద్దనూరు : ముద్దనూరులోని ప్రధాన రహదారిలో శనివారం రాత్రి పలు దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానిక శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయం పక్కనే వరుసగా వున్న 2 దుకాణాలు, వైఎస్సార్ సీపీ కార్యాలయం తలుపులకు వేసిన తాళాలు పగలగొట్టారు. స్థానికంగా ఓ హోటల్‌లోని కొంత నగదు ఎత్తుకెళ్లిరు..కొత్త కొట్టాల వీధిలోని ఓ దుకాణంలో చోరీ యత్నం జరిగినట్లు బాధితులు తెలిపారు.


