వేంపల్లె : ఆర్టీసీ బస్సు ఆపకుండా పోవడంతో.. డ్రైవర్‌ను ఓ ప్రయాణికుడు చెప్పుతో కొట్టాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందుల నుంచి ఆదివారం కడపకు ఎక్స్‌ప్రెస్ సర్వీసు బయలుదేరింది. ఈ క్రమంలో వేంపల్లె రాజీవ్ కాలనీ వద్ద ఒక ప్రయాణికుడు బస్సును ఆపే ప్రయత్నం చేశాడు. అక్కడ బస్సు స్టేజీ లేదు, ఫుల్ లోడ్‌తో ఉండటంతో డ్రైవర్ మల్లికార్జునరెడ్డి ఆపకుండా వేంపల్లె బస్టాండ్‌కు వెళ్లాడు. అయితే ప్రయాణికుడు ఊరుకోకుండా బైక్‌లో బస్సును వెంబడించి కడప రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద.. బస్సు ఆపి ఆర్టీసీ డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషించి పాదరక్షలతో కొట్టాడు. తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినకుండా కొట్టి వెళ్లిపోయాడు. డ్రైవర్ కొద్ది సేపు బస్సును అక్కడే ఆపి వేశాడు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఆ ప్రయాణికుడు క్షమాపణ చెప్పే వరకు బస్సు కదలనీయబోనని డ్రైవర్ భీష్మించుకుని కూర్చున్నాడు. ప్రయాణికులు అందరిని వేరే బస్సులో ఎక్కించారు. డ్రైవర్, కండక్టర్‌తోపాటు ఘటన చూసిన ప్రయాణికుడు బస్సు తీసుకొని వేంపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. విషయాన్ని వేంపల్లె సీఐ నరసింహులుకు తెలిపి ఫిర్యాదు చేశారు. కొట్టిన వ్యక్తి ఎవరని పోలీసులు ఆరా తీస్తున్నారు.


