దారి తప్పుతున్న యువత
ప్రొద్దుటూరు క్రైం : ‘రేయ్ మచ్చా..! ఒక చిన్న పని ఉంది వస్తావా.. చెప్పరా మామా.. ఏం చేయాలి.. నీ కోసం ప్రాణమైనా ఇస్తా’.. ఇది ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా వినిపించే మాట. రేయ్ ఒక చిన్న పని ఉంది అంటూ ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడంటే చాలు.. ఎక్కడికి వెళ్లాలి? ఎందుకు వెళ్లాలనే ఆలోచన లేకుండానే.. కొందరు యువకులు వెళ్తున్నారు. స్నేహితుడి కోసం ఏం చేయడానికై నా సిద్ధమంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చివరికి అదే స్నేహం వారిని కేసుల్లో ఇరికించి పోలీస్‌స్టేషన్, కోర్టు, జైళ్ల చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకెళ్తోంది. ప్రొద్దుటూరులో ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. యువతలో పెరుగుతున్న ఈ ధోరణి ఆందోళన కలిగిస్తోంది. చిన్న పాటి కారణాలకే యువకుల మధ్య తలెత్తుతున్న వివాదాలు తీవ్ర ఘర్షణలకు దారి తీస్తున్నాయి. చివరికి గ్యాంగ్‌లుగా ఏర్పడి దాడులు చేసుకునే స్థాయికి చేరుతున్నాయి.
ప్రొద్దుటూరులో నిత్యం యువకుల గొడవలే..
రీల్స్ ప్రభావమో లేక స్వతహాగా వచ్చిన ఆలోచనేమో తెలియదు కానీ.. ఇటీవల విద్యార్థులు కొట్టుకునే సీన్లు, వాళ్లు ఎంట్రీ ఇచ్చే విధానం చూస్తే గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోవనిపిస్తుంది. ప్రొద్దుటూరులో ఈ తరహా గొడవలు నిత్యకృత్యమయ్యాయి.
అందులో కొన్ని ఘటనలు..
● నాలుగు రోజుల క్రితం ప్రేమ వ్యవహారంలో బీటెక్ చదువుతున్న ఇద్దరు స్టూడెంట్‌ల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం.. గ్యాంగ్‌లుగా ఏర్పడి కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితులతో కలసి బార్‌లో ఉండగా.. మరో బీటెక్ విద్యార్థి తన స్నేహితులను వెంట తీసుకొని అక్కడికి వెళ్లాడు. 10 మందికి పైగా యువకులు కేకలు వేస్తూ బార్‌లోకి ప్రవేశించారు. రాడ్లు, కట్టెలు, బీరు బాటిళ్లతో వెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలు పరస్పరం దాడులకు తెగపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో బీటెక్ విద్యార్థికి గాయాలయ్యాయి. పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 9 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు.
● పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ఉన్న ఫంక్షన్ హాల్‌లో జరిగే పెళ్లి కోసం తాడిపత్రి నుంచి వాహనాల్లో బంధువులు వచ్చారు. ఈ క్రమంలో రాత్రి యువకులు అక్కడ మద్యం తాగి రాళ్లు రువ్వుకోవడంతో పెళ్లికి వచ్చిన వాహనాల అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పెళ్లి వాళ్లకు ఈ విషయం తెలిసి అక్కడికెళ్లి యువకులను ప్రశ్నించారు. దీంతో ఏడుగురు యువకులు మద్యం మత్తులో పెళ్లివాళ్లపై దాడి చేశారు. వారు భయపడి ఫంక్షన్ హాల్లోకి వెళ్లినా వదల్లేదు. రాళ్లు విసిరి భయభ్రాంతులకు గురి చేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులపై కూడా యువకులు తిరగబడ్డారు.
● కొన్ని రోజుల క్రితం గాంధీరోడ్డులో కొందరు యువకులు రాత్రి 12 గంటల సమయంలో రోడ్డుపైనే మద్యం తాగుతూ కేకలు వేయసాగారు. విధుల్లో ఉన్న హోంగార్డు వారి వద్దకు వెళ్లి ఎందుకు ఈ టైంలో అల్లరి చేస్తున్నారు.. ఇంటికి వెళ్లిపోండని సూచించాడు. దీంతో యువకులు వినిపించుకోకుండా హోంగార్డుపైనే దాడికి దిగారు. యువకుల దాడిలో హోంగార్డుకు గాయాలయ్యాయి. దారిన పోయే స్థానికులు కొందరు సర్దిచెప్పినా వినిపించుకోలేదు.
● ఇటీవల వరుసగా ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని సర్కిల్‌లో రాత్రి సమయాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. యువకులు మద్యం మత్తులో విచక్షణా రహితంగా దాడులు చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటినా యువకులు గుంపులుగా చేరడం, కొట్టుకోవడంతో అక్కడ చుట్టుపక్కల నివాసాలున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
మద్యం కీలక పాత్ర
ఇటీవల యువకుల మధ్య ఉన్న మద్యం స్నేహం విడదీయరానిదైంది. ప్రొద్దుటూరులో జరుగుతున్న ప్రతి గొడవ వెనుక మద్యం కీలకపాత్ర పోషిస్తోంది. గొడవకు వెళ్లే ముందు మద్యం తాగడం.. గొడవలు ముగిశాక సిట్టింగ్ వేయడం అనేది పరిపాటిగా మారింది. పార్టీ ఉందిరా మామా అంటే చాలు మరి కొంత మంది దోస్తుగాళ్లను తోడు చేసుకొని క్షణాల్లో ఎంత దూరంలో ఉన్నా చేరిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం
యువతలో ఈ తరహా మార్పులకు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం కూడా ఒక ప్రధాన కార ణం. పిల్లలపై నమ్మకం ఉంచడంతోపాటు వారి స్నేహాలు, అలవాట్లు, ప్రవర్తనలో వస్తున్న మార్పులను గమనించాలి. ఆలస్యంగా ఇంటికి రావడం, తరచూ పార్టీలు, కొత్త స్నేహాలు, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి మార్పులను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
మద్యం మత్తులో గొడవలు
జైలు పాలవుతున్న భవిత


