ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న ఓ బార్‌లో చోరీ జరిగింది. సుమారు రూ.30 వేల దాకా అపహరించారని బార్ నిర్వహకులు తెలిపారు. దొంగ బార్‌లోని పైకప్పు రేకులు తీసి లోనికి ప్రవేశించి, చోరీ చేసినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. ఈ విషయంపై ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు వస్తే విచారణ చేపడుతామని సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.
లింగాల : లింగాల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కత్తి రామచంద్రుడు అనే వ్యక్తి ఇంటిపై వేట కొడవళ్లతో దాడి జరిగింది. రవితేజ, నాగప్రసాద్, ప్రకాష్‌రెడ్డి, వెంకట చలపతితోపాటు సుమారు పది మంది వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కత్తి రామచంద్రుడు ఆయన భార్య చంద్రావతికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితుల వద్ద స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. ఘర్షణ ఎందుకు జరిగింది అనే విషయంపై విచారణ చేస్తున్నామని ఆయన అన్నారు.
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ఈ నెల 4వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి (50) వైద్య పరీక్షల కోసం వచ్చి ఈ నెల 11న మృతి చెందాడు. మరో వ్యక్తి (47) ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం జీజీహెచ్‌లో వైద్యం కోసం చేరాడు. అదే రోజున సాయంత్రం మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను మార్చురీలో వుంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు.


