● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మేధావుల
ఫోరం అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్‌రెడ్డి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరాన్ని పటిష్టం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు పి.ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా మేధావుల ఫోరం సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తటస్థంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు, ఇంజినీర్లను, పార్టీ సానుభూతి పరులను వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షితులయ్యేలా చేయాలన్నారు. పని చేస్తామని వచ్చే వారిని గ్రామ, మండల కమిటీల్లో నియమించాలన్నారు. సీఎం చంద్రబాబు అధికారం కోసం ఎన్ని దుర్మార్గాలకై నా పాల్పడుతారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలా చేయరన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల పేద ప్రజలకు ప్రయోజనకరమని, ప్రైవేటు ఆధీనంలో ఉంటే వారికి నష్టమన్నారు. ఈ విషయం మేధావులు సులభంగా అర్థం చేసుకోగలరన్నారు. వాళ్ల వాళ్లకు సంపద సృష్టించడానికే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌కు.. చంద్రబాబుకు మధ్య తేడాను ప్రజలకు వివరించాలన్నారు. రూ.5 వేల కోట్లతో మెడికల్ కాలేజీలను కట్టలేనని చెబుతూ, అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. తటస్థులుగా ఉన్న 20 శాతం మందిని వైఎస్సార్‌సీపీ వైపు తిప్పుకోగలిగితే మన విజయం సులభమవుతుందని తెలిపారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ మేధావుల మౌనం సమాజానికి ప్రమాదకరమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను, మంచి చెడులను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మేధావులపై ఉందన్నారు. మేధావుల ఫోరానికి సంబంధించి అన్ని కమిటీలను పూర్తి చేయాలని, కష్టపడి పనిచేసే వారిని అందులో నియమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిసునీల్, మేధావుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పి.సంపత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పి.క్రిష్ణమూర్తి, సంజీవయ్య, మునిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు డి.వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి డాక్టర్ రామాంజులరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బి.విష్ణువర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు పి. వెంకటరెడ్డి, ఏ.శ్రీనివాసులు, వై.కుమార్‌రెడ్డి, భరత్ కుమార్‌రెడ్డి, అబ్దుల్లా, ఇలియాస్ పాల్గొన్నారు.


