శ్రీధర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం | - | Sakshi
Sakshi News home page

శ్రీధర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

Jul 15 2026 1:10 AM | Updated on Jul 15 2026 1:10 AM

ఆ బోటులో నేను ఎక్కలేదు.. సహచర డిస్ట్రిబ్యూటర్‌ తీవ్ర ఆవేదన

కడప అర్బన్‌ : కడప నగరానికి చెందిన ప్రముఖ సెల్‌ఫోన్‌ డిస్ట్రిబ్యూటర్‌ ముడియం శ్రీధర్‌ వియత్నాం పర్యటనలో బోటు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహం మంగళవారం మధ్యాహ్నం కడప నగరంలోని అరవిందనగర్‌లో నివాసంకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీధర్‌ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌ వాహనంలో కడపకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, మృతుని కుటుంబసభ్యులు తీసుకుని వచ్చారు. శ్రీధర్‌ పార్థివదేహాన్ని చూడగానే ఆయన సతీమణి ధనలక్ష్మి, కుమారుడు కౌశిక్‌, కుమార్తె కిరణ్మయిలతో పాటు, కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కడపలో ఆయన మృతి సెల్‌ఫోన్‌ డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారస్తులు, పనిచేస్తున్న సిబ్బంది హృదయాలను కలిచివేసి తీవ్ర విషాదం నెలకొంది.

● మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌.బి.అంజాద్‌బాషా ముడియం శ్రీధర్‌ నివాసానికి వెళ్లి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతోపాటు మాజీ కార్పొరేటర్‌ మహమ్మద్‌ షఫీ, ఓబుల్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

శ్రీధర్‌ కుటుంబానికి జిల్లా కలెక్టర్‌

డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సంతాపం

మృతి చెందిన ముడియం శ్రీధర్‌ భౌతికకాయంను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, జిల్లా యంత్రాంగం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుడు శ్రీధర్‌ పనిచేసిన కంపెనీ తరపున అందించాల్సిన పరిహారం, సహాయ సహకారాలు, ఇతర అవసరమైన చర్యలు త్వరగా పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట కడప ఆర్డీవో మురళి, కేఎంసీ కమిషనర్‌ భవానీ ప్రసాద్‌, అదనపు కమిషనర్‌ రాకేష్‌ చంద్రం, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు కెఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ కందుల చంద్రఓబుళరెడ్డి (నాని)తో పాటు, సెల్‌ఫోన్‌ డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులు, సిబ్బంది విచ్చేశారు. అలాగే శ్రీధర్‌ కుటుంబానికి కడప ఎమ్మెల్యే దంపతులు మాధవిరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం సాయంత్రం శ్రీధర్‌ మృతదేహాన్ని అశ్రునయనాల మధ్య కడప నగరంలోని మోచంపేటలో వున్న హిందూ స్మశానవాటికలో సంప్రదాయం ప్రకారం దహనసంస్కారాలను నిర్వహించారు. కడప నగర పాలకసంస్థ కమిషనర్‌ భవానీప్రసాద్‌, డిప్యూటీ కమిషనర్‌ రాకేష్‌చంద్ర, రాయలసీమ వ్యాప్తంగా సెల్‌ఫోన్‌ డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులు, అక్కడ పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు.

నివాళులర్పిస్తునన్న మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌బాషా

శ్రీధర్‌ మృతదేహానికి నివాళులర్పిస్తునన్న కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

కడపకు చేరుకున్న శ్రీధర్‌ మృతదేహం

కన్నీటి పర్యంతమైన భార్య

కుటుంబ సభ్యులు

పార్థివ దేహాన్ని పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌.బి అంజాద్‌బాషా

పరామర్శించిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, అధికారులు

కడపకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్‌ డిస్ట్రిబ్యూటర్‌ ముడియం శ్రీధర్‌ అన్న ఎక్కిన బోటును వియత్నాంలో తాను ఎక్కివుంటే ఈపాటికి నేను శ్రీధర్‌ మాదిరిగానే మృత్యువాత పడేవాడిని. కానీ తాను ఆ బోటును ఎక్కలేదు. శ్రీధర్‌ బోటు ఎక్కిన తరువాత తాను బోటు ఎక్కబోతే పరిమితికి మించి ఎక్కువ సంఖ్య అయ్యారనీ తనను, శ్రీధర్‌తో పాటు వచ్చిన నయీంను దించేశారు. బోటు సముద్రంలోకి వెళ్లిన ఏడే నిమిషాలలో బోటు తిరగబడటం, రెస్క్యూటీం సముద్రంలోకి వెళ్లడం ఇప్పటికి కళ్లకు కట్టినట్లుగా అనిపిస్తోంది. – ప్రదీప్‌రెడ్డి, తిరుపతి లావా సెల్‌ఫోన్‌ సంస్థ డిస్ట్రిబ్యూటర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement