● రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.396 రద్దు చేయాలి
● దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపులశాఖ ప్రైవేటీకరణను సత్వరమే ఉపసంహరించుకుని జారీ చేసిన జీఓ నెం. 396ను రద్దు చేయాలని రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్‌శాఖ పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ దస్తావేజు లేఖర్లు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఈనెల 20 తేదీ నుంచి 31వ తేదీ వరకు డాక్యుమెంట్ రైటర్లు పెన్‌డౌన్ చేయాలని నిర్ణయించారన్నారు. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ శాఖ సేవలతో పాటు కక్షిదారుల సొంత వ్యవహారమైన దస్తావేజుల తయారీ విధానాన్ని కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ జీఓ జారీ చేయడం దారుణమన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, దస్తావేజు లేఖరులు, స్టాంపులు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, లేఖరుల సహాయకుల జీవనోపాధిని కాపాడాలని, దస్తావేజులేఖరుల లైసెన్సులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జూలై 20 నుంచి జూలై 31 వరకు రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల పరిధిలోని దస్తావేజులేఖరులు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రవిక్రయదారులు, జిల్లా ప్రజానీకం, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ న్యాయమైన డిమాండ్లకు సాధన కొరకు జరుగుతున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, లేఖర్లకు, స్టాంపు వెండర్లు ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతున్నందున జీవో నెం 396ను పరిశీలించి జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల యూనియన్ నగర అధ్యక్షుడు సంజీవరాయుడు, నగర నాయకులు సి.నాగరాజు, ఎస్‌ఎండీ ఇక్బాల్, ఓబుల కొండయ్య, కె.ఓబులేశు, రామకృష్ణ, సుబ్బరాయుడు, లోకనాథం, హరి, రమణ, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


