ఒంటిమిట్టలో రూ. 5 కోట్ల ఉపాధి పనులు
సామాజిక తనిఖీలో వెల్లడించిన డ్వామా పీడీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండలంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 5 కోట్ల లక్ష 70వేల 583 వ్యయంతో ఉపాధి పనులు జరిగాయని డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయం ఆవరణంలో డ్వామా పీడీ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీల వారిగా జరిగిన పనులు, వాటికి ఖర్చు చేసిన వ్యయం, ఆ పనుల్లోని లోపాల గురించి చర్చించారు. ఈ చర్చలో పలు పంచాయతీలలో జరిగిన ఉపాధి పనులలో కొలతలు తప్పుగా నమోదు చేశారని, 5 కి.మీ దూరం లేకున్నా ఉందని చెప్పి రవాణా భత్యం అందించారని, కొన్ని మస్టర్లలో ఉపాధి కూలీలకు సంబంధించి కొంత మంది సంతకాలు చేయలేదని, మరి కొంత మందికై తే అదనంగా పని నగదును చెల్లించి, మళ్లీ రికవరీ చేశారని, 100 రోజుల పనిదినాలను పూర్తి స్థాయిలో చేయించలేదనే లోపాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అనంతరం డ్వామా పీడీ మాట్లాడుతూ..మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మండల వ్యాప్తంగా ఉన్న 13 పంచాయతీలలో 685 పనులు జరిగాయన్నారు. అందులో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో 657, ఎస్‌ఎస్‌ఏలో 1, పంచాయతీరాజ్‌లో 25, అటవీ శాఖలో 2 పనులు చేశారన్నారు. ఈ తనిఖీల్లో బయట పడ్డ లోపాలను త్వరిత గతిన సరిదిద్దుకోవాలని, అదనంగా చెల్లించిన వ్యయాన్ని రికవరీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఏపీడీ ఆజాద్, క్వాలిటీ కంట్రోల్ అధికారి జుబేదా, ఎంపీడీఓ సుజాత, ఏపీఓ శివశంకర్‌రెడ్డి, సామాజిక తనిఖీ బృందం, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.


