మహిళల రక్షణ, హక్కుల సాధనకు తోడ్పడాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : పిల్లలు, మహిళల రక్షణతోపా టు వారి హక్కుల సాధనకు మహిళా పోలీసులు పా టుపడాలని ఐసీడీఎస్ పీడీ రమాదేవి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో బాలలకు ఉన్న చట్టాలు, మిషన్ వాత్సల్య అందిస్తున్న సేవల గురించి మహిళా పోలీసులకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమాదేవి మాట్లాడుతూ మహిళా పోలీసులు తమ సచివాలయ పరిధిలోని మహిళలు, పిల్లలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని వాటిని నివృత్తి చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ శోభారాణి మహిళా పోలీసులు విధి నిర్వహణలో పాటించాల్సిన మెలకువలు, పిల్లల పట్ల వ్యవహరించాల్సిన వైఖరిని వివరించారు. ఈ కార్యక్రమంలో మహహిళా పోలీసులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, శిశుగృహ మిషన్ శక్తి సిబ్బంది పాల్గొన్నారు.
నైపుణ్య ఆధారిత విద్యను అమలు చేయాలి
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధికి భరోసా ఇచ్చేలా నైపుణ్య ఆధారిత విద్య అమలు చేయాల్సి ఉందని ఆ దిశగా సిలబస్ రూపకల్పన జరగాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేశారు. రెండు జిల్లాల డిగ్రీ కళాశాలల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీ ఓఎస్) చైర్మన్లతో మంగళవారం తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలిత ఆధారిత విద్యను అమలు చేయాల్సి ఉందన్నారు. డిగ్రీ కోర్సులలో ప్రస్తుత సమాజ అవసరాలను తీర్చే నాణ్యమైన సిలబస్ తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సిలబస్ తో పాటు, ప్రశ్న పత్రాల రూపకల్పన, మూల్యాంకనంలో సరికొత్త మార్పులు అవసరమన్నారు. ఈ సమావేశంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు, వివిధ డిగ్రీ సబ్జెక్టుల బీఓఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.
మహిళల రక్షణ, హక్కుల సాధనకు తోడ్పడాలి


