ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తొలగింపు దుర్మార్గం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరు తొలగించి గాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే పేరు కలిసేలా జి రామ్ జి అని చేర్చడం అత్యంత దుర్మార్గమైన చర్య అని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఆర్‌సీపీ కార్యాలయంలో ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు పేద ప్రజలను, గ్రామీణ ఉపాధి కూలీలను పస్తులు ఉంచేలా, వలసలు వెళ్లేలా కేంద్రం చూస్తోందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా సంపన్నులకు వెట్టి చాకిరీ చేసేందుకు మనుషులను సిద్ధం చేసే పనిలో భాగమే ఉపాధి హామీ తొలగింపు అన్నారు. బీజేపీ సంపన్నుల పక్షమే అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. మోడీకి అత్యంత ప్రియమైన వారు ఇద్దరు అయితే పూర్తిగా నచ్చని వారు ఇద్దరు ఉన్నారని, ఒకరు రైతులు, మరొకరు వ్యవసాయ కూలీలు అన్నారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టం మార్పుపై ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ మగ్బుల్ బాషా, సిద్ధిరామయ్య, ఆంజనేయులు, అనంతపురం జిల్లా కార్యదర్శి అక్బర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


