అగస్త్యేశ్వరాలయంలో ఆభరణాల తనిఖీ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరాలయంలో అగస్త్యేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి బంగారు వెండి, ఆభరణాలను సోమవారం దేవదాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆలయ ఈఓ వెంకటసుబ్బయ్య ఆభరణాల తనిఖీ చేపట్టాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో రాయలసీమ జోన్ జ్యువెలరి వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి తనిఖీ చేశారు. ఆలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న శివప్రసాద్‌పై ఆరోపణలు రావడం, పూర్వ ఈఓ రామచంద్రాచార్యులు రిటైర్డ్ అయిన తరువాత బాధ్యతలు చేపట్టిన వెంకటసుబ్బయ్యకు ఆభరణాలను అప్పజెప్పకపోవడంతో ఆభరణాల గోల్‌మాల్ జరిగిందని వచ్చిన ఆరోపణలతో ఆభరణాల తనిఖీ జరిగింది. కొన్ని బంగారు, వెండి ఆభరణాల లెక్కలు తేలకపోవడంతో వాటి రశీదులు, ఆభరణాలను మంగళవారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆభరణాల తనిఖీలో దేవదాయ ఆభరణాల అప్రైజర్ మాధవస్వామి, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


