కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ
అత్యున్నత ప్రమాణాలతో
శిక్షణ పొందేందుకు వచ్చిన అనంతపురం జిల్లా పోలీసు కానిస్టేబుళ్లు
మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, పాల్గొన్న పోలీసు అధికారులు
కడప అర్బన్ : కొత్తతరం పోలీసింగ్‌కు అనుగుణంగా అనుభవజ్ఞులైన పోలీస్ అధికారులు ఇచ్చే శిక్షణను ట్రైనీ కానిస్టేబుళ్లు సద్వినియోగం చేసుకుని సమర్థవంతంగా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం కడప నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో (డి.పి.టి.సి) లో అనంతపురం జిల్లాకు చెందిన సివిల్ ట్రైనీ కానిస్టేబుళ్లు 194 మందికి, అలాగే 11 వ బెటాలియన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందే ఏ.పి.ఎస్.పి కి ఎంపికై న కానిస్టేబుళ్లు 330 మందికి 9 నెలల పాటు ఇచ్చే ట్రైనింగ్ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ట్రైనీ కానిస్టేబుళ్లకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ట్రైనింగ్‌కు అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేశారన్నారు. వంద శాతం క్రమశిక్షణ, నిజాయితీతో విశేష అనుభవమున్న పోలీస్ అధికారులు అందించే శిక్షణను వినియోగించుకోవాలన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రంలోని అత్యాధునిక సైబర్, కంప్యూటర్ ల్యాబ్ లను సద్వినియోగం చేసుకుని సైబర్, ఫైనాన్సియల్ నేరాల దర్యాప్తు విధానంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలని సూచించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల సౌకర్యం కోసం ’సజెషన్ బాక్స్’ ఏర్పాటు చేశామని, సలహాలు, సూచనలు రాసి అందులో వేయవచ్చన్నారు. ట్రైనింగ్‌లో భాగంగా నిర్దేశిత ప్రమాణాలతో నిర్వహించే మిడ్ టర్మ్, ఫైనల్ పరీక్షలను తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో 11 వ బెటాలియన్ కమాండెంట్ కె.ఆనంద రెడ్డి, అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు, డీటీసీ డీఎస్పీ పి అబ్దుల్ కరీం, కడప నగరంలోని సీఐలు, ఎస్‌ఐ లు పాల్గొన్నారు.
క్రమశిక్షణ, నిజాయితీగా శిక్షణ పూర్తి చేసుకోవాలి
ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆధునిక సాంకేతికతపై అవగాహన
పెంపొందించుకోవాలి
ట్రైనీ కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ


