బాకీ డబ్బు అడిగినందుకు క్రూరంగా హతమార్చాడు
ప్రొద్దుటూరు క్రైం : గాఢ నిద్రలో ఉన్న మహేశ్వరరెడ్డిని స్వీట్ దుకాణం యజమాని రామచంద్రారెడ్డి అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని మూడు ముక్కలుగా కసితీరా నరికాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహం భాగాలను గోనె సంచిలో వేసుకొని స్కూటీలో తీసుకెళ్లి పట్టణ శివారులో పడేశాడు. ఈ దారుణ ఘటన 2024 జూన్ 23న ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో చోటు చేసుకుంది. అప్పట్లో ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులోని ముద్దాయి భూమిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రొద్దుటూరు ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విఽధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ద్వార్శల నాగరత్నమ్మకు 35 ఏళ్ల క్రితం శ్రీనివాసరెడ్డితో వివాహమైంది. వీరికి వెంకటమహేశ్వరరెడ్డి అనే కుమారుడు ఉండేవాడు. కొన్నేళ్ల క్రితం శ్రీనివాసరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భూమిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎంఆర్‌కాలనీలో ఓ ఇల్లు బాడుగకు తీసుకొని స్వీట్ల దుకాణం నిర్వహించేవాడు. నాగరత్నమ్మ 15 ఏళ్లుగా దుకాణంలో స్వీట్లు తయారు చేసే పనికి వెళ్లేది. ఇలా రామచంద్రారెడ్డితో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. కొన్ని రోజులు గడచిన తర్వాత నాగరత్నమ్మ, ఆమె కుమారుడు మహేశ్వరరెడ్డి, దుకాణ యజమాని రామచంద్రారెడ్డి ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. స్వీటు దుకాణం యజమానికి నాగరత్నమ్మ రూ. 3 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు విషయమై నాగరత్నమ్మ కుమారుడు, దుకాణం యజమాని తరచూ గొడవ పడేవారు.
రూ.120 కోసం నిలదీశాడని..
తనకు డబ్బు అవసరముందని 2024 జూన్ 23న రూ.120 ఇవ్వమని మహేశ్వరరెడ్డి అడిగితే రామచంద్రారెడ్డి ఇవ్వలేదు. తమకు బాకీ ఉన్న డబ్బులో నుంచి ఇవ్వాలని గట్టిగా దబాయించి అడిగాడు. ఈ విషయమై ఇద్దరు గొడవ పడుతుండగా నాగరత్నమ్మ ఇరువురికి సర్ది చెప్పి కుమారుడికి డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించింది. కొద్ది సేపటి తర్వాత మహేశ్వరరెడ్డి మద్యం సేవించి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఈ క్రమంలో 24న తెల్లవారు జామున నిద్రపోతున్న మహేశ్వరెడ్డి తలపై రాచమంద్రారెడ్డి ఇనుప రాడ్డు తీసుకొని కొట్టడంతో అతను అపస్మారక స్థితిలో ఉండిపోయాడు. తర్వాత కత్తితో పొడిచి చంపేశాడు. హత్య చేసిన విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకని మృతదేహాన్ని మూడు భాగాలుగా కోశాడు. శరీర భాగాలను గోనె సంచిలో వేసుకొని స్కూటీలో తీసుకెళ్లి జమ్మలమడుగు బైపాస్‌రోడ్డు సమీపంలోని కంపచెట్లలో పడేశాడు. మరో గదిలో పడుకున్న నాగరత్నమ్మ తెల్లారాక నిద్రలేచి చూడగా గది నిండా రక్తపు మరకలు ఉన్నాయి. తన కుమారుడు కనిపించకపోవడంతో రామచంద్రారెడ్డి చొక్కా పట్టుకొని నిలదీసింది. నీ కుమారుడుకి పట్టిన గతే నీకూ పడుతుందని బెదిరించి అతను పారిపోయాడు. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు వాదనలు ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టులో కొనసాగుతూ వచ్చాయి. నేరం రుజువు కావడంతో ముద్దాయి రామచంద్రారెడ్డికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 3 లక్షలు జరిమానా విధిస్తూ సెకండ్ ఏడీజే జడ్జి కె.సత్యకుమారి సోమవారం తుదితీర్పు చెప్పారు.
అధికారులకు ప్రశంసలు
ఈ కేసులో అడిషనల్ పీపీ మార్తల సుధాకర్‌రెడ్డి తన వాదనలతో ముద్దాయికి శిక్ష పడేలా చేశారు. సకాలంలో సాక్షులను కోర్టులో హాజరు పరిచి ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన డీఎస్పీ భావన, కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్‌కానిస్టేబుల్ ఏ.నాగరాజు, త్రీ టౌన్ పీసీ పి.పవన్‌కుమార్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.
హత్య కేసులో ముద్దాయికి
యావజ్జీవకారాగార శిక్ష
రూ.3 లక్షలు జరిమానా
ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టు తీర్పు
మహేశ్వరరెడ్డిని హత్య చేసి మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికిన రామచంద్రారెడ్డి
2024లో ప్రొద్దుటూరులోని
వైఎంఆర్ కాలనీలో జరిగిన ఘటన


