క్రీడలతో శారీరక, మానసికోల్లాసం
కడప ఎడ్యుకేషన్ : క్రీడలతో విద్యార్థులకు శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం లభిస్తుందని జిల్లా పరిషత్తు సీఈఓ ఓబులమ్మ తెలిపారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. జిల్లాలోని 15 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు గ్రాండ్ ఓపెనింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా పరిషత్తు సీఈఓ ముఖ్య అతిథిగా హాజరు కాగా స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ అండ్ ట్రెయినింగ్(ఎస్‌బీటీఈటీ) జాయింట్ సెక్రటరీ టి.శేఖర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. వారు క్రీడా జెండాను ఊపడంతోపాటు క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్నా విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరం అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతి, పలు డిపార్టుమెంట్ల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


