చేనేతల కష్టాలు విస్మరించిన కూటమి ప్రభుత్వం
జమ్మలమడుగు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేనేతల కష్టాలను పూర్తిగా విస్మరించిందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని నాగులకట్టలో చేనేతల జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నేతన్న నేస్తం పేరిట ప్రతి ఏడాది 24వేల రూపాయలు చేనేత కార్మికుల ఖాతాలలో జమ చేయడం వల్ల చేనేత కార్మికులకు లబ్ధి చేకూరేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు జగన్ అమలు చేసిన పథకాలను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు ఆ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శివనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మనోహర్, సత్యనారాయణ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, ఓబులేసు పాల్గొన్నారు.


