
మాట్లాడుతున్న సీఏవైడీ జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్‌రెడ్డి
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానం వేదికగా సినీతారల క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ చివరివారం లేదా జనవరి మొదటివారంలో టాలీవుడ్, బాలీవుడ్ నటులతో కూడిన క్రికెట్ జట్లు కడప నగరంలో క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానాన్ని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఎం. భరత్‌రెడ్డి, ఏసీఏ సీఈఓ ఎం. వెంకటశివారెడ్డితో కలిసి ప్రముఖ సినీనటులు శ్రవణ్, ఖయ్యూం, మధునందన్, సీసీసీ చైర్మన్ షకీల్‌షఫీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా క్రికెట్ నెట్స్‌లో సినీనటులు కొద్దిసేపు ప్రాక్టీస్ చేసి సందడి చేశారు.
ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో.. సినీతారల మెరుపులు..
కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానం వేదికగా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో సినిమా తారలు విచ్చేసి క్రికెట్ మ్యాచ్ ఆడనున్నట్లు చారిటీ క్రికెట్ క్లబ్ (సీసీసీ) చైర్మన్ షకీల్ షఫీ పేర్కొన్నారు. స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజానికి మేలు చేసే అంశాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు చారీటీ మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా వరుసగా సినీతారలతో వివిధ ప్రాంతాల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ యేడాది కడప వేదికగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో నిర్వహించే మ్యాచ్‌కు బాలీవుడ్ నటులు, టాలీవుడ్ నటులు హాజరవుతారని తెలిపారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్‌ఆర్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఎం. భరత్‌రెడ్డి మాట్లాడుతూ కడప వేదికగా రంజీమ్యాచ్‌లు, జాతీయస్థాయి మ్యాచ్‌లు నిర్వహించామని, తొలిసారిగా సినీతారల క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఫ్లడ్‌లైట్లను ప్రారంభించిన తర్వాత డిసెంబర్ చివరి లేదా జనవరి మొదటివారంలో మ్యాచ్‌ను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు, క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సీఈఓ ఎం. వెంకటశివారెడ్డి మాట్లాడుతూ చారిటీ క్రికెట్ క్లబ్ పేరుతో 2011 నుంచి వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బీసీసీఐ, ఏసీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సినీతారల క్రికెట్ మ్యాచ్ అలరిస్తుందన్నారు. ఈ మ్యాచ్‌కు ఎలాంటి రుసుం లేకుండా ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం సినీనటులను క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో సీఏవైడీ ప్రతినిధులు ఎల్. మునికుమార్‌రెడ్డి, పృధ్వీ, పరిపాలనాధికారి శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయస్థాయి స్టేడియంలా ఉంది..:
ప్రముఖ విలన్ శ్రవణ్
కడప నగరంలో ఇంత చక్కటి క్రికెట్ స్టేడియం ఉంటుందని ఊహించలేదు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు కలిగిన స్టేడియం ఉండటం, ఈ మైదానంలో మాకు ఆడే అవకాశం రానుండటం సంతోషంగా ఉంది. సేవా కార్యక్రమాలకు మావంతు సహకారంగా మ్యాచ్‌లు ఆడనున్నాం.
అందరూ వీక్షించండి..:
హాస్యనటుడు ఖయ్యూం
నేను క్రికెటర్‌గా దుబాయ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాలన్నింటినీ చూశాను.. ఆ తరహాలో కడపలో మైదానం ఉండటం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడ మైదానం చూసిన తర్వాత 200 శాతం సంతోషంతో మ్యాచ్ ఆడేందుకు వస్తున్నాం. కడప ప్రజలు, క్రీడాభిమానులు విచ్చేసి వీక్షించండి.
ఉన్నత ప్రమాణాలు కలిగిన మైదానం :
హాస్యనటుడు మధునందన్
కడపలోని స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో చక్కగా ఉంది. ఇక్కడి పచ్చిక, పిచ్ చాలా బాగున్నాయి. ఇంత చక్కటి మైదానం ఉండటం మాకు ఆశ్చర్యం కలిగించింది. సినీతారల మ్యాచ్‌ను అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాం.
డిసెంబర్ చివరి లేదా జనవరి
మొదటివారంలో నిర్వహణ
బాలీవుడ్, టాలీవుడ్ తారలతో ఫ్లడ్‌లైట్ వెలుగుల్లో సెలబ్రిటీ మ్యాచ్
ఉచిత ప్రవేశం
మైదానాన్ని పరిశీలించిన సినీ నటులు శ్రవణ్, ఖయ్యూం, మధునందన్

బ్యాటింగ్ చేస్తున్న కమెడియన్ మధునందన్

బౌలింగ్ చేస్తున్న ప్రముఖ విలన్ శ్రవణ్