ఒక్కగానొక్క కొడుకు.. అతడి కోసం పిల్లలే వద్దనుకున్నారు, చివరకు..

- - Sakshi

వైఎస్సార్‌: తమ కుమారుడిని బతికించుకోవాలని వారి ఎంతో కష్టపడ్డారు.. అయినా వారి ఆశలు ఫలించలేదు. తమకు పుట్టిన మానసిక వికలాంగుడైన కుమారునికి ఏ కష్టం రానివ్వకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో.. తదుపరి పిల్లలు వద్దనుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. వారి ఆశలు సమాధి చేస్తూ.. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఆదివారం రాత్రి మృతి చెందాడు. కలసపాడు మండలంలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన సంబంధించి వివరాల్లోకి వెళితే.. కలసపాడుకు చెందిన మునగలకుమార్‌, ఆదిలక్ష్మి దంపతులకు 14 ఏళ్ల క్రితం యోగేంద్రకుమార్‌ జన్మించాడు.

పుట్టకతోనే మానసిక వికలాంగుడు. భార్యాభర్తలిద్దరూ తదుపరి పిల్లవాడు పుడితే ఎక్కడ ముందు పుట్టిన వాడిని సక్రమంగా చూసుకునేందుకు వీలుపడదన్న దూర ఆలోచనతో.. పిల్లలే వద్దనుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆ పిల్లాడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కష్టపడి సంపాదించిన వారి సంపాదనంతా పిల్లాడి వైద్యానికి ఖర్చు చేస్తుండేవారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వైద్య పరీక్షల నిమిత్తం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా.. ఆదివారం రాత్రి మృతి చెందాడు.

దీంతో ఉన్న ఒక్కగానొక్క బిడ్డ కోసం సర్వస్వం అర్పించి చేసిన త్యాగానికి ఫలితం లేకుండా పోయింది. ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన విద్యార్థి కలసపాడు ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో చదువుకుంటుండటంతో విషయం తెలుసుకున్న ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.రమణారెడ్డి సోమవారం విద్యార్థి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఐఈఆర్‌టీ బి.రాజారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top