కురబలకోటలో మెరిసిన మోహనుడు

కురబలకోట రైల్వే స్టేషన్‌లో సీతామాలక్ష్మి సినిమా సన్నివేశం (ఫైల్‌)  - Sakshi

కురబలకోట : వైవిధ్య పాత్రలతో మెప్పించి.. నట విశ్వరూపం చూపిన చంద్ర మోహనుడితో కురబలకోట వాసులకు విడదీయరాని అనుబంధం ఉంది. అతడి మరణ వార్త విన్న ఆయన అభిమానులు ఉద్వేగానికి గురయ్యారు. అన్నమయ్య జిల్లా కురబలకోట రైల్వే స్టేషన్‌లో నాడు ఆయన చెప్పిన మాటలు.. చేసిన నటనను గుర్తు చేసుకున్నారు. కళా తపస్వి కె.విశ్వనాఽథ్‌ దర్శకత్వంలో చంద్రమోహన్‌, తాళ్లూరి రామేశ్వరిలు సీతామాలక్ష్మి సినిమాలో నటించారు. కురబలకోట మండలంలోని తెట్టు, కురబలకోట రైల్వే స్టేషన్‌లో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నాడు చిత్రీకరించారు.

శ్రీమావి చిగురు తినగానే కోవిల పలికేనా..్ఙ పాట చిత్రీకరణ కురబలకోట రైల్వే స్టేషన్‌లో జరిగింది. చిత్రంలో ఓ పాత్రధారి వెటకారం చేస్తూ ఏ ఊరు మీది అని ప్రశ్నించినపుడు చంద్రమోహన్‌ మాది మదనపల్లె వద్ద కురబలకోట అని చెబుతాడు. సినిమాలో డైలాగ్‌ విన్న కురబలకోట వాసులు అప్పట్లో ఊగిపోయారు. 1978 జూలై, 27న విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమా చంద్రమోహన్‌కు హీరోగా సినీ రంగంలో ఎదగడానికి అవకాశం ఇచ్చింది. ఈ సినిమా విజయంతో ఈ ప్రాంతంలో మరెన్నో సినిమాలు తీయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. ఈ చిత్ర యూనిట్‌ తెట్టులోని కామకోటి ప్రసాదరావు ఇంట్లో బస చేశారు. ఒకటిన్నర నెలపాటు తెట్టు వేణుగోపాలస్వామి ఆలయం, గ్రామ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌ నిర్వహించారు.

శనివారం చంద్రమోహన్‌ మరణవార్త తెలుసుకోగానే.. కళ్లు చెమర్చారు. నాటి అభిమానులు ఆయన పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. కురబలకోట రైల్వే స్టేషన్‌ రూపు రేఖలు మారినా.. ఈ ప్రాంత వాసుల మనసుల్లో ఈ సినిమా చెక్కుచెదర లేదు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top