ప్రజలకు దక్కని వాటా
గండికోట ఉత్సవాల్లో ప్రాధాన్యత ఏదీ?
నాడు–నేడు ఎంత తేడా!
సాక్షి ప్రతినిధి, కడప: కడప ద్విశతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కడపోత్సవాలు సైతం అదే తీరున చేపట్టారు. ఆ కార్యక్రమాల్లో జిల్లా కళాకారులకు ప్రాధాన్యత, చరిత్రకారులకు భాగస్వామ్యం దక్కింది. జిల్లా వ్యాప్తంగా ఉత్సవాన్ని స్వంత పండుగలా చేపట్టారు. ఇపుడు తద్భిన్నంగా గండికోట ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా భాగస్వామ్యం కొరవడింది. సినీ కళాకారులకే పరిమితమైంది. అది కూడా ఇరువురు సింగర్స్, డ్రమ్స్ నిర్వాహకుడు ఒకరికి మాత్రమే పరిమితమైంది. దీంతో ఉత్సవాల నిర్వహణలో నాటికి, నేటికి ఎంత తేడా ఉందో విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
● కడపోత్సవాలను అప్పటి కలెక్టర్లు జయేష్‌రంజన్, అశోక్‌కుమార్..కడప ద్విశతాబ్ది ఉత్సవాలను కృష్టబాబు అద్భుతంగా నిర్వహించారు. ఇప్పటికీ జిల్లా వాసులకు గుర్తుండిపోయేలా నాటి కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలోని అన్ని రంగాల ప్రముఖులను భాగస్వామ్యులను చేశారు. జిల్లా వ్యాప్తంగా చరిత్రకారులు, కళాకారులు, రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులతో చర్చించారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దిశగా కార్యచరణ ముందే సిద్ధం చేశారు. అప్పటి అధికారుల చిత్తశుద్ధి కారణంగానే అత్యంత పారదర్శకంగా చరిత్రలో గుర్తుండిపోయేలా ఉత్సవాలు చేపట్టారు.
గండికోట ఉత్సవాల్లో జిల్లాలోని చరిత్రకారులు, కళాకారులకు ప్రాధాన్యత శూన్యమనే చెప్పాలి. ఇప్పటికి వరకూ సింగర్స్ మంగ్లీ, రామ్ మిర్యాల, డ్రమ్స్ శివమణి ఒక్కొక్క రోజు ఒకరు పాల్గొననున్నారు. ఆమేరకు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఫలితంగా ఆనాటి వైభవం ఉట్టి పడేలా ఉత్సవాలను నిర్వహించడం, జిల్లా ప్రజల్ని భాగస్వామ్యులను చేయడంలో విఫలమయ్యారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈ నెల 11, 12, 13వ తేదీలలో గండికోట ఉత్సవాలు నిర్వహిస్తుంటే ఆ దిశగా ప్రణాళికలు, స్థానికుల భాగస్వామ్యం దక్కలేదు. పైగా గండికోట కేంద్రంగా పెమ్మసాని వంశస్థులు పాలించారు. వారిలో పెమ్మసాని చిన తిమ్మనాయుడు ప్రముఖుడు. వారి వారసుడు పెమ్మసాని ప్రభాకర్‌నాయుడు ఇప్పటికీ పలుమార్లు గండికోట ఉత్సవాలకు హాజరయ్యారు. కాగా, అధికార యంత్రాంగం జిల్లా ప్రజలతో పాటు, పెమ్మసాని వారసులను కూడా విస్మరించారు. గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మినహా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేది ఇప్పటికీ ప్రజానీకానికి స్పష్టత లేకుండా పోయింది. సినిమా సెట్టింగ్ తరహాలో ఏర్పాట్లు చేయడం మినహా గండికోట ఉత్సవాల్లో జిల్లా వాసుల భాగస్వామ్యం ఏముందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
సమష్టి కార్యాచరణతో కడప ద్విశతాబ్ది, ఉత్సవాలు
అంగరంగ వైభవంగా నాటి పాలకుల నిర్వహణ
నేడు గండికోట ఉత్సవాల్లో కన్పించని నాటి ప్రణాళిక
స్థానిక చరిత్రకారులు,కళాకారులకు దక్కని ప్రాధాన్యత


