కడప అర్బన్ : కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న తాటిచెర్ల లక్ష్మీ(45) అనే మహిళను ఆమెతో వివాహేతర సంబంధం చేసిన వ్యక్తే కాలయముడిగా మారి రోకలిబండతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటన జరిగిన ఒకటిన్నర రోజు తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నచౌక్ పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ముద్దనూరుకు చెందిన తాటిచెర్ల లక్ష్మికి, నారాయణ స్వామికి నవీన, సస్మిత అనే ఇద్దరు కుమార్తెలు సంతానం.
నారాయణ స్వామి అనారోగ్యంతో కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. తాటిచెర్ల లక్ష్మీ, తన ఇద్దరు కుమార్తెలకు మూడేళ్ల క్రితం ఒకరికి, తరువాత ఇటీవల రెండవ కుమార్తెకు వివాహం చేసింది. పెద్ద కుమార్తె వివాహం అయిపోగానే లక్ష్మి, కడపలోని ఎన్జీఓ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉండేది. ఈ క్రమంలో బేల్దారి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న జమ్మలమడుగుకు చెందిన ఆవుల రామాంజనేయులుతో ఆమెకు పరిచయం పెరిగింది. అతనితో పాటు కూలిపనికి వెళుతూ, అతనితోనే వివాహేతర సంబంధం కొనసాగించింది.
కొన్ని రోజుల నుంచి ఇద్దరు మనస్పర్థలతో గొడవపడేవారు. నిందితుడు ఆవుల రామాంజనేయులు ఎలాగైనా లక్ష్మీ పీడ వదిలించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి లక్ష్మి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమె నిద్రకు ఉపక్రమించిన సమయంలో రోకలిబండతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఎవరికంటా పడకుండా పరారయ్యాడు. మరుసటి రోజు శనివారం రాత్రి చుట్టు పక్కల మహిళలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని చిన్నచౌక్ ఎస్‌ఐ రవికుమార్, హెడ్‌కానిస్టేబుల్ రామసుబ్బారెడ్డి, పోలీసు సిబ్బంది పరిశీలించారు.
లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. లక్ష్మి కుమార్తె నవీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. కాగా లక్ష్మిని దారుణంగా హత్య చేసిన నిందితుడు ఆవుల రామాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


