అత్యవసర వైద్యం అంతంతే! | - | Sakshi
Sakshi News home page

అత్యవసర వైద్యం అంతంతే!

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

నిలిచిన క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌

సాక్షి, యాదాద్రి: భువనగిరి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు. ఏరియా ఆస్పత్రి స్థాయి నుంచి 220 పడకల జనరల్‌ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ కావడంతో పాటు మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా మారడంతో ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు అందుబాటులోకి వచ్చారు. కానీ అత్యవసర వైద్యం, స్కానింగ్‌ల కోసం వచ్చే వారిని ప్రైవేట్‌కు లేదా హైదరాబాద్‌లోని ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. మౌలిక వసతులు, యంత్రాల నిర్వహణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించినా వాటిని ఖర్చు చేయకుండా మూలనపడేస్తున్నారు. ఓవైపు కీలక విభాగాల్లో వైద్యులు, సాంకేతిక సిబ్బంది కొరత వేధిస్తుండగా.. మరోవైపు విధులు నిర్వహించాల్సిన కొందరు వైద్యులు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పరీక్షలన్నీ ప్రైవేట్‌కే..

భువనగిరి జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ చేయించుకోవాలంటే పైరవీ చేయాల్సిందే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఏడాది క్రితం రూ.లక్షలు వెచ్చించి తెచ్చిన సీటీ స్కాన్‌ యంత్రాన్ని టీహబ్‌ కొత్త బిల్డింగ్‌లో ఉంచారు. ఆర్‌ఏంఓతో పైరవీ చేస్తే తప్ప రోగికి స్కానింగ్‌ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రిలో వైద్య పరికరాలు, రీ ఏజెంట్ల కొనుగోలుకు రూ. 2.61 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. అయినా పాడైన ఎక్స్‌రే యంత్రానికి మరమ్మతులు చేయించకుండా ఆ గదికి తాళం వేశారు. అవసరం ఉన్న రోగులను తమకు అనుకూలమైన ప్రైవేట్‌ సెంటర్లకు పంపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ప్రొఫెసర్లు ఉన్నా..

భువనగిరిలోని ఏరియా ఆస్పత్రి స్థాయిని పెంచి 220 పడకల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఈ ఆస్పత్రిలో మెడికల్‌ ప్రొఫెసర్లు ఉన్నా రోగులకు సరైన వైద్యం అందడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఇక్కడే చికిత్స అందించకుండా.. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. ఆస్పత్రిలో జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, రేడియాలజీ విభాగాల్లో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. వీరితో పాటు ల్యాబ్‌ టెక్నీషియన్ల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.

మౌలిక వసతుల లేమితో అవస్థలు

ఆస్పత్రిలో నిత్యం ఓపీకి 450 నుంచి 500 వరకు రోగులు వస్తుంటారు. సోమవారం ఈ సంఖ్య 550 నుంచి 700 వరకు చేరుకుంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఓపీ విభాగం పనిచేస్తుండటంతో కౌంటర్ల వద్ద రద్దీ నెలకొంటోంది.అదనంగా ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.

క్యాజువాలిటీలో బెడ్ల కొరత

ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగంలో కేవలం రెండు, మూడు బెడ్లు మాత్రమే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటి సంఖ్యను పెంచాలని ఎంతో కాలంగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు పోస్ట్‌మార్టం గదిలో ఒకటే ఫ్రీజర్‌ ఉండటంతో, ఒకటి కంటే ఎక్కువ మృతదేహాలు వచ్చినప్పుడు భద్రపర్చడం సవాలుగా మారుతోంది. ఇక రోగులతో వచ్చే సహాయకులకు వెయిటింగ్‌ షెడ్‌ లేకపోవడంతో వరండాలోనే కూర్చొని భోజనాలు చేయాల్సి వస్తోంది.

తాళం వేసి ఉన్న ఎక్స్‌రే గది

ఆస్పత్రిలో సీటీస్కాన్‌ మిషన్‌

భువనగిరి జనరల్‌ ఆస్పత్రిలో రోగుల ఇక్కట్లు

ఫ జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, రేడియాలజీ విభాగాల్లో డాక్టర్ల కొరత

ఫ రూ.2.61 కోట్లున్నా యంత్రాల నిర్వహణగాలికి

ఫ పైరవీ చేస్తేనే సీటీ స్కాన్‌.. ఎక్స్‌రే గదికి తాళం

రెండేళ్ల క్రితం మంజూరైన క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ పనులను కాంట్రాక్టర్‌ అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పటికి 70 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం వల్లే పనులు నిలిచిపోయినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement