భువనగిరిటౌన్ : జిల్లా కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీల కేసుల పురోగతిపై శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జయరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చెక్ బౌన్స్ ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 5 దీర్ఘకాలిక కేసులను రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు తెలిపారు. దీని ద్వారా కక్షిదారులకు రూ.19,60,000 చెల్లింపులు జరిగేలా చూశామని వెల్లడించారు. మరిన్ని చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి నవంబర్ 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, సబ్ జైలు సూపరింటెండెంట్ నెహ్రూ, భువనగిరి ఏసీపీ రవీందర్, యాదాద్రి ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తులు
భువనగిరి: ఖమ్మం స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశాల ఎంపికకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి శ్యాంసుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించే ఎంపికకు 14 నుంచి 16 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన విద్యార్థులు రావాలని పేర్కొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
మోత్కూరు : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శనివారం మోత్కూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 150కి పైగా నూతన విద్యార్థులు రావడం శుభ సూచకమన్నారు. ప్రధానోపాధ్యాయుడు దేవినేని అరవిందరాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, ఇన్‌స్పెక్టర్ సి.వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి టి.సత్యనారాయణ, పాఠశాల కమిటీ చైర్మన్ దబ్బెటి శైలజ, కౌన్సిలర్ కుర్మిళ్ల ప్రమీల రాములు పాల్గొన్నారు.
31లోగా బయోమెట్రిక్ పూర్తిచేయాలి
సాక్షి, యాదాద్రి : రేషన్ కార్డుదారులు ఈనెల 31లోగా బయోమెట్రిక్ ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నివాస ప్రాంతానికి సమీపంలో అందుబాటులో ఉన్న ఏ రేషన్ దుకాణానికై నా స్వయంగా వెళ్లి వేలిముద్ర వేసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి: జిల్లాలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న మూడు పోస్టులకుగాను ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు తమ దరఖాస్తులను ఈ నెల 20 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.
రైతు వేదికల్లో
విద్యుత్ బకాయిలు
ఆత్మకూరు(ఎం): రైతు వేదికలు విద్యుత్ బకాయిల బారిన పడ్డాయి. ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు ఇవ్వకపోవడంతో నెల వారీ బిల్లులు బకాయి పడాల్సి వచ్చింది. ఆత్మకూరు(ఎం), పల్లెపహాడ్, పల్లెర్ల, కూరెల్ల, కప్రాయపల్లి క్లస్టర్లలోని రైతు వేదికల్లో సెప్టెంబర్– 2022 నుంచి ప్రభుత్వం మెయింటనెన్స్ కింద ఖర్చులు ఇవ్వకపోవడంతో ఈ బిల్లులు పేరుకుపోయాయి. ఆత్మకూరు(ఎం) రైతు వేదిక విద్యుత్ బిల్లు రూ.14,730 రాగా నెల రోజుల క్రితం విద్యుత్ కనెక్షన్ తొలగించారు. పల్లెర్ల రైతు వేదిక విద్యుత్ బిల్లు రూ.14,797, కప్రాయపల్లి రైతు వేదిక బిల్లు రూ.10,200, పల్లెపహాడ్‌లో రూ. 10వేలు, కూరెల్ల రైతు వేదికలో రూ.14వేల వరకు బకాయి ఉంది.


