సాక్షి, యాదాద్రి : యూట్యూబ్‌లో చూసిన ఓ చిన్న ఆలోచనతో.. తన పత్తి పంటను కాపాడుకునేందుకు రెయిన్ గన్‌లను రంగంలోకి దించాడు. తక్కువ నీటితోనే పొలమంతా వర్షం కురిపిస్తూ సాగులో ఆదర్శంగా నిలుస్తున్నాడు భువనగిరి మండలం జమ్మాపురం గ్రామానికి చెందిన రైతు బాలస్వామి. ఆయన తనకున్న 15 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాడు. విత్తనాలు వేసి నెలన్నర దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రెండుసార్లు విత్తనాలు వేయడంతో ఇప్పటికే దాదాపు రూ.6 లక్షల వరకు పెట్టుబడి అయింది. మొక్కలు ఎండు ముఖం పట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తూ యూట్యూబ్‌లో ‘రెయిన్ గన్’ ద్వారా పంటలకు నీరందించే విధానాన్ని చూశాడు. ఆలస్యం చేయకుండా వెంటనే రూ.40 వేల ఖర్చుతో మూడు రెయిన్ గన్‌లను కొనుగోలు చేసి, తన పొలంలో అమర్చాడు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో జమ్మాపురం గ్రామానికి చెందిన మరికొంతమంది రైతులు రెయిన్ గన్‌ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.


