ఫ జిల్లా ఉపాధి కల్పన అధికారిణి పద్మ వెల్లడి
భువనగిరిటౌన్ : తెలంగాణ ప్రభుత్వ విదేశీ మానవవనరుల సంస్థ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్)లోని ఒక ప్రముఖ సంస్థలో 500 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్. పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం క్లీనర్స్ , టైల్ మేసన్, ఆల్ రౌండ్ మేసన్, బ్లాక్/ప్లాస్టర్ మేసన్, స్టీల్ ఫిక్సర్, షట్టరింగ్ కార్పెంటర్, ప్లంబర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్, ఫినిషింగ్ కార్పెంటర్, వెల్డర్, జనరల్ హెల్పర్ ట్రేడ్ లో ఖాళీలు ఉన్నట్లు వివరించారు. ఎంపికై న వారికి నైపుణ్య స్థాయి ప్రకారం అదనపు పని వేళల (ఓవర్ టైమ్) భత్యంతో పాటు జీతం ఉంటుందని, వసతి, రవాణా, వంటగది సౌకర్యాలను యజమానే కల్పిస్తారని పేర్కొన్నారు. రోజుకు 9 గంటల పని వేళలు ఉంటాయని, విమాన ప్రయాణ టికెట్ ఖర్చులను అభ్యర్థులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ నెల 21న హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సమీపంలో గల సంస్థ కొత్త కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు బయోడేటా, పాస్‌పోర్ట్, విద్యార్హత, అనుభవ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8328602231, 9440050951, 9440051452 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.
మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
బొమ్మలరామారం: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేయాలని డీఆర్‌డీఓ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం బొమ్మలరామారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శ్యామల, సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, ఎంపీఓ శ్రీమాలిని, ఏపీఎం చెంచల యాదగిరి, ఏపీఓ శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేయాలి
నల్లగొండ : సీఎంఆర్ డెలీవరిని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు. గురువారం నల్లగొండలోని రెవెన్యూ అదనపు కలెక్టర్ చాంబర్‌లో ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన ఖరీఫ్ 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ఎఫ్‌సీఐ రేక్ మూమెంట్, స్థలాలు, ఎఫ్‌సీఐ పేమెంట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. సీఎంఆర్ డెలివరీని ప్రతిరోజూ డీఎస్‌ఓలు, పౌరసరఫరాల డీఎంలు మిల్లల వారీగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి వారం మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా డీఎస్‌ఓలు, పౌర సరఫరాల డీఎంలు, రైస్ మిల్లర్లు, సివిల్ సప్లయ్, ఎన్‌పోర్స్‌మెంట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
వస్తువుల సరఫరాకు టెండర్లు ఆహ్వానం
భువనగిరి: జిల్లాలోని 62 ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇండోర్, అవుట్‌డోర్ ఫర్నిచర్, ఆట వస్తువులు, వాల్ పెయింటింగ్‌కు సంబంధించిన వస్తువులు సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల కోసం ఒక్కో పాఠశాలకు రూ. లక్ష చొప్పున నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన సరఫరాదారులు అవసరమైన పత్రాలు, డిమాండ్ డ్రాఫ్టుతో కూడిన టెండర్ దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అందజేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారిని సంప్రదించాలని సూచించారు.


