పెసరలో చీడపీడలు.. నివారణ మార్గాలు | - | Sakshi
Sakshi News home page

పెసరలో చీడపీడలు.. నివారణ మార్గాలు

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

నడిగూడెం : ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు సాగు చేసిన పెసర పంట ఎదిగే దశలో ఉంది. పలు చోట్ల పూత, పిందె దశలో ఉంది. ఇలాంటి సమయంలో ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడితే చీడపీడలను నివారించి మంచి దిగుబడులు పొందవచ్చని నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్‌ సూచిస్తున్నారు. పెసర పంటను ఆశించే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ చర్యలు ఆయన మాటల్లోనే..

ఆశించే పురుగులు

1. చిత్త పురుగులు : ఈ పురుగులు పెసర పంటపై రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. నీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే 80 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

2. తామర పురుగు : ఈ పురుగులు పంట తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుంచి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత తెగులు కూడా వ్యాపిస్తుంది. పంటకు 15–20 శాతం నష్టం కలుగుతుంది. దీని నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

3. తెల్లదోమ : ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లోమొజాయిక్‌ అనే వైరస్‌ వ్యాధి(పల్లాకు తెగులు) కూడా వ్యాపింపజేస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.5 మి.లీ. లేదా మిథైల్‌ డెమటాన్‌ 2.0 మి.లీ. లేదా ట్రైజోఫాస్‌ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

4. పొగ్గాకు లద్దె పురుగు : ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీరి తినడం వలన ఆకులు తెల్లగా కన్పిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా, పువ్వులను, పిందెలను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రి పూట ఎక్కువగా నష్టపరుస్తుంటాయి. దీని నివారణకు గుడ్ల సమూదాయాలను ఏరివేయాలి. జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 30 వేల ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆశించే తెగుళ్లు

1. సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగులో గుండ్రని చిన్నచిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీని వలన పెసర కాయల్లో గింజలు సరిగ్గా నిండవు. దీని నివారణకు మ్యాంకోజెబ్‌ 2.5 గ్రాములు లేదా కార్బెండిజమ్‌ 1 గ్రాము లేదా క్లోరోథలోనిల్‌ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

2. బూడిద తెగులు : ఈ తెగులు విత్తిన 30–35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలు కనబడి క్రమేపీ పెద్దవై ఆకలపైన, కింద భాగాలకు మరియు కొమ్మలు, కాయలకు వ్యాపిస్తుంది. దీని నివారణకు కార్బెండిజమ్‌ 1 గ్రాము లేదా థయోఫానేట్‌ మిథైల్‌ 1 గ్రాము లేదా డీనోక్యాప్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

3. బ్యాక్టీరియ్‌ లీఫ్‌ బ్లైట్‌ : ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 3 గ్రాములు మరియు 100 మి.గ్రా. ప్లాంటోమైసీన్‌ కలిపి 12 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

4. పల్లాకు తెగులు: ఇది వైరస్‌ జాతి తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులు, కాయల మీద పసుపు మచ్చ పొరలు ఏర్పడతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమీథోయేట్‌ 2. మి.లీ. లేదా ట్రైజోఫాస్‌ 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

నడిగూడెం మండల

వ్యవసాయాధికారి మల్సూర్‌ సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement