మిర్యాలగూడ టౌన్ : ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామంలో మంగళవారం జరిగింది. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అవంతీపురం గ్రామంలో కామ్రే రాజు తన భార్య అరుణతో పాటు ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అరుణ మంగళవారం తెల్లవారుజామున వంట గదిలోకి వెళ్లి బల్బు స్విచ్ ఆన్ చేయగా అప్పటికే కిచెన్‌లో గ్యాస్ లీకై ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అరుణకు మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దంతో పాటు మంటలు ఇల్లు మొత్తం వ్యాపించడంతో ఇంట్లోని ప్లాస్టిక్ సామగ్రి, గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. అరుణ భర్త, పిల్లలు వెంటనే ఆమెను తీసుకుని బయటకు పరుగుల తీశారు. స్థానికులు గమనించి మంటలు ఆర్పివేసి అరుణను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ షాపు దగ్ధం
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్స్ షాపులో మంగళవారం షార్ట్ సర్క్యూట్ జరిగి షాపు దగ్ధమైంది. స్థానికులు, షాపు నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్స్ షాపులోని పై అంతస్తులో ఉన్న స్టోర్ రూంలో సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. గదిలోని అట్టా పెట్టలకు మంటలు అంటుకుని ఒక్కసారిగా దట్టమైన పొగ రావడంతో షాపు నిర్వాహకులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. స్టోర్ రూంలోని ఎల్‌ఈడీ టీవీలతో పాటు కొన్ని ఫ్రిడ్జ్‌లు కాలిపోయాయని, సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.
ఎంఎన్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్‌లో..
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలోని మారం నర్సింహస్వామి(ఎంఎన్‌ఎస్) ఎంటర్‌ప్రైజెస్ షాపులో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండటంతో సోమవారం తెల్లవారుజాము వరకు మంటలు వ్యాపించాయి. ఎల్‌ఈడీ సెట్, జిరాక్స్ మిషన్, టైలరింగ్‌కు సంబంధించిన దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయాయని, సుమారు రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లిందని షాపు యజమాని తెలిపాడు.
గ్యాస్ లీకై మహిళకు గాయాలు
షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన
ఎలక్ట్రానిక్స్ షాపు


