‘కార్పొరేషన్‌’పై ఆశలు! | - | Sakshi
Sakshi News home page

‘కార్పొరేషన్‌’పై ఆశలు!

Jul 14 2026 4:47 AM | Updated on Jul 14 2026 4:47 AM

పదవీకాలం ముగిసిన వారికి రెన్యువల్‌ లేనట్లే..

నామినేటెడ్‌ పదవులను ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్‌ నేతలు

జిల్లాకు చెందిన నలుగురు కార్పొరేషన్‌ చైర్మన్ల పదవీకాలం పూర్తి

వారి స్థానంలో ఎవరికి పదవులు దక్కుతాయోనని జోరుగా చర్చ

ఇద్దరు ముగ్గురికే అవకాశం రావచ్చంటున్న పార్టీ వర్గాలు

మంత్రులు, సీనియర్‌ నేతలను ప్రసన్నం చేసుకుంటున్న ఆశావహులు

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి కార్పొరేషన్‌ పదవులు ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి దక్కాయి. టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌గా పటేల్‌ రమేష్‌రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా ముత్తినేతి వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రీతం, మహిళా శిశు సంక్షేమ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన బండ్రు శోభారాణి రెండేళ్ల పదవీ కాలం ఇటీవల ముగిసింది. అయితే వారికి మళ్లీ అవకాశం ఇస్తారేమోనన్న చర్చ జరిగినా ఆ పరిస్థితి లేదని గాంధీభవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో వారికి ప్రత్యామ్నాయంగా పార్టీ బాధ్యతలను అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. గుత్తా అమిత్‌కు పార్టీ సోషల్‌ మీడియా విభాగం బాధ్యతలు, పటేల్‌ రమేష్‌రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులపై జిల్లా నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈనెల చివరి వారంలో కార్పొరేషన్‌ చైర్మన్లను నియమిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో నామినేటెడ్‌ పదవులను ఆశిస్తున్న జిల్లా నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు జిల్లా నుంచి వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న నలుగురి పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో ఎలాగైనా తాము పదవులను దక్కించుకునే వ్యూహంతో నేతలు ముందుకు సాగుతున్నారు. తమ గాడ్‌ ఫాదర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరోవైపు మంత్రులు కూడా తమ అనుచరులకు అవకాశం కల్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఖాళీ అయిన ఆ నాలుగు స్థానాలకు బదులుగా కొత్తగా నలుగురికి అవకాశం కల్పిస్తారా? లేదా? అన్న చర్చ జిల్లాలో సాగుతోంది.

ఇప్పుడు కాకపోతే ఇక కష్టమే

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలలకు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. అందులో మొదటి విడతలో పదవులను ఆశించిన నేతలు కొందరికి అవకాశం దక్కలేదు. పార్టీలో సీనియర్లు అయినప్పటికీ, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కూడా అవకాశం దక్కకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు. అప్పట్లో పదవులు దక్కని నేతలు ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కనుక కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు దక్కకపోతే ఇక కష్టమేనన్న భావనతో ఉన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రితోపాటు మంత్రులను, జానారెడ్డి లాంటి సీనియర్‌ నేతలను కలిసి తాము పార్టీకి చేసిన సేవలను గుర్తించాలని కోరుతున్నారు. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీలాంటి నిర్ణయం తీసుకుంటుందో? ఎవరికి అవకాశం కల్పిస్తుందోనన్న చర్చ ఆసక్తికరంగా మారింది.

భారీగానే ఆశావహులు..

మాజీమంత్రి జానారెడ్డి ప్రధాన అనుచరుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, పెద్దవూర మాజీ జెడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి, మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సన్నిహితుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు గుమ్మల మోహన్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో మొదట ఇద్దరు ముగ్గురికే కార్పొరేషన్‌ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. 2009 నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో నకిరేకల్‌ అసెంబ్లీ టికెట్‌ను ఆశించిన కొండేటి మల్లయ్యకు, ప్రస్తుతం సీఎంకు అనుచరుడిగా కొనసాగుతున్న దుబ్బాక నర్సింహారెడ్డికి కార్పొరేషన్‌ పదవి దక్కుకుందని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగతా వారిలో కోదాడకు చెందిన సీనియర్‌ నాయకుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డికి అవకాశం దక్కవచ్చన్న చర్చ సాగుతోంది. అయితే వారిలో ఎవరిని అదృష్టం వరిస్తుందన్నది ఈనెలాఖరుకు తేలవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement