‘సర్‌’లో ఆలేరు టాప్‌ | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో ఆలేరు టాప్‌

Jul 14 2026 4:47 AM | Updated on Jul 14 2026 4:47 AM

విస్తృత ప్రచారమే నంబర్‌ 1కు కారణం

77.25 శాతం డిజిటలైజేషన్‌తో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

వారంలోనే ఫారాల పంపిణీ పూర్తి

సమన్వయంతో పనిచేసిన అధికారులు, సిబ్బంది

ఆలేరు : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచి ప్రత్యేకతను చాటుకుంది. అధికార యంత్రాంగం సమన్వయం, బూత్‌ లెవెల్‌ అధికారుల (బీఎల్‌ఓ) కృషి, రాజకీయ పార్టీల సహకారం, ఓటర్ల నుంచి లభించిన అద్భుత స్పందనతో నియోజకవర్గంలో ‘సర్‌’ ప్రక్రియ అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. వలిగొండ మండలంలోని మూడు పోలింగ్‌ కేంద్రాలను కలుపుకుని, నియోజకవర్గంలోని మొత్తం ఎనిమిది మండలాల్లో ఉన్న 309 పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని 2,38,040 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ వంద శాతం పూర్తయింది. ఈ ప్రక్రియలో మోటకొండూరు మండలం మొదటి స్థానంలో నిలవగా.. యాదగిరిగుట్ట చివరి స్థానంలో నిలిచింది.

శరవేగంగా డిజిటలైజేషన్‌

గత నెల 25న ప్రారంభమైన ఈ ప్రక్రియలో బీఎల్‌ఓలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రతి ఓటరుకీ ఫారాలు అందించడం విశేషం. ఫారాలను ఓటర్ల నుంచి వాటిని తిరిగి సేకరించడం, అనంతరం డిజిటలైజేషన్‌ను శరవేగంగా పూర్తి చేయడం ద్వారా ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల కంటే ఎంతో ముందు వరుసలో నిలిచింది. సోమవారం నాటికి నియోజకవర్గంలోని మొత్తం 2,38,040 మంది ఓటర్లలో 1,83,890 మంది ఓటర్ల ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయింది. ఇది రికార్డు స్థాయిలో 77.25 శాతానికి చేరుకుంది.

కలెక్టర్‌ నుంచి బీఎల్‌ఓ వరకు సమన్వయం

జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అడిషనల్‌ కలెక్టర్‌ వెంకారెడ్డిల నిరంతర పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు అధికారులకు వారు అందిస్తున్న సూచనలు ఈ విజయానికి కీలకంగా మారాయి. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో పని చేయడంతోపాటు.. ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పించడం కూడా నియోజకవర్గంలో ‘సర్‌’ విజయవంతం కావడానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ప్రకారం.. ఈ నెల 24వ తేదీలోగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలనే పట్టుదలగా అధికారులు ముందుకు సాగుతున్నారు.

పాఠశాల, కళాశాలల విద్యార్థులు, రేషన్‌ డీలర్లు, పొదుపు సంఘాల మహిళలను భాగస్వాములను చేసి, ఎన్యుమరేషన్‌ ఫారాలు ఎలా నింపాలో శిక్షణ ఇచ్చాం. వారు ఓటర్లకు క్షేత్రస్థాయిలో వివరించారు. బీఎల్‌ఓలు సైతం ఓటర్లను నేరుగా కలుసుకుని వారి సందేహాలు తీరుస్తూ ఫారాలు సక్రమంగా నింపేలా అవగాహన కల్పించారు. దీంతో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

–వలిగొండ ఆంజనేయులు, ఆలేరు తహసీల్దార్‌

మండలం పీఎస్‌లు ఓటర్లు డిజిటలైజేషన్‌ శాతం

బొమ్మలరామారం 40 29360 23851 81.24

తుర్కపల్లి 39 28116 22132 78.72

రాజాపేట 40 29805 24326 81.62

యాదగిరిగుట్ట 48 40925 27951 68.30

ఆలేరు 41 34589 24338 70.36

మోటకొండూరు 29 20755 17715 85.35

గుండాల 35 25816 20490 79.37

ఆత్మకూరు 34 25743 21272 82.63

వలిగొండ 3 2931 1815 61.92

మొత్తం 309 238040 183890 77.25

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement