పెద్దవూర : మండలంలో ఎప్పుడు నీటితో కళకళలాడే పెద్దవాగు సరైన వర్షాలు లేక ఎండిపోయింది. దీంతో వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైదులు ఆందోళన చెందుతున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు సరైన వర్షం పడలేదు. చిన్నపాటి వర్షాలు పడగా.. విత్తనాలు వేసుకోవడానికి కావాల్సిన పదును మాత్రమే అయ్యింది. ఎగువ నుంచి వరద రాకపోవడంతో నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. గత ఐదారేళ్లుగా ఏనాడు పెద్దవాగు ఎండిపోలేదు. ఏఎమ్మార్పీ నీటి రాకతో నిత్యం చెరువులు అలుగులు పోస్తుండంతో వాగులో నీళ్లు పుష్కలంగా ఉండేవి. గత ఏడెనిమిది నెలలుగా వర్షాభావ పరిస్థితులు ఉండటంతో చెరువులు ఎండిపోయాయి. దీంతో పెద్దవాగు ఎండిపోయింది. వాగు వెంట సాగుచేసుకున్న వందలాది ఎకరాలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది.
వందల ఎకరాలలో సాగు
నాంపల్లి మండలం పసునూరు చెరువు వద్ద పుట్టిన పెద్దవాగు గుర్రంపోడు, పెద్దఅడిశర్లపల్లి మండలాల మీదుగా పెద్దవూర మండలంలోకి ప్రవహిస్తుంది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మాణం కాకముందు వర్షాకాలంలోనే ఈ వాగులో నీరు ప్రవహించేది. ప్రాజెక్టు నిర్మాణంతో కాలువల ద్యారా ఎప్పటికప్పుడు చెరువులను నింపుతుండటం, జంట నగరాలకు కృష్ణాజలాలలను అందించే వాటర్ ప్లాంట్‌ను పదిహేను రోజులకొకసారి కడుగుతుంటుండంతో పెద్దవాగులో నిత్యం నీళ్లు ప్రవహిస్తుండేవి. దీంతో వాగు సమీపంలో భూములు ఉన్న రైతులు వాగులో విద్యుత్ మోటార్లు వేసుకుని పైపులైన్‌లు తీసుకుని పంటలు సాగు చేసుకునేవారు. పెద్దవూర, ఈదులగూడెం, పిన్నవూర, బట్టుగూడెం, కొత్తగూడెం, తెప్పలమడుగు, లింగంపల్లి, పెద్దగూడెం, చిన్నగూడెం గ్రామాలకు చెందిన రైతులు వాగు వెంట సుమారు వెయ్యి ఎకరాలలో వరినాట్లు వేశారు. వాగును నమ్ముకుని వాగుకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములకు పైపులైన్లు వేసుకుని బత్తాయి తోటలను సాగుచేస్తున్నారు. వాగు ఎండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు సరిగా పడకపోవడంతో బత్తాయి తోటలు, పత్తి చేలకు నీటి అవసరం రాగా, ఒక్కసారిగా వరినాట్లు వేయడంతో విద్యుత్ మోటార్లు అన్నింటిని ఒకేసారి ఆన్ చేయడంతో వాగులో నీరు అయిపోతుంది. పై నుంచి నీరు రాకపోవడంతో వీరంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
పెద్దవూర సమీపంలో ఎండిపోయిన పెద్దవాగు
వర్షాలు లేక ఎండిపోవడంతో
ఆందోళనలో రైతులు


